తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మీ చర్యలేంటి?'- ఫేస్​బుక్​కు కాంగ్రెస్ రెండో లేఖ

భాజపాకు ఫేస్​బుక్ అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ మరోసారి ఆ సంస్థకు లేఖ రాసింది కాంగ్రెస్. ఫేస్​బుక్ ఇండియా పక్షపాత వైఖరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. మరోవైపు ఈ అంశంపై సంయుక్త పార్లమెంట్ కమిటీతో విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్.

Congress questions Zuckerberg on hate speech row, alleged BJP links
'మీ చర్యలేంటి?'- ఫేస్​బుక్​కు కాంగ్రెస్ రెండో లేఖ

By

Published : Aug 29, 2020, 5:47 PM IST

దేశంలో భాజపాకు అనుకూలంగా ఫేస్​బుక్ ఇండియా వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై ఏయే చర్యలు తీసుకున్నారో వివరించాలంటూ కాంగ్రెస్ పార్టీ.. ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​కు లేఖ రాసింది. ఈ నెలలో జుకర్​బర్గ్​కు కాంగ్రెస్ లేఖ రాయడం ఇది రెండోసారి.

ఆగస్టు 17న కాంగ్రెస్ రాసిన లేఖను ప్రస్తావించారు కేసీ వేణుగోపాల్. ఈ సందర్భంగా తాజాగా టైమ్ మ్యాగజైన్​లో వచ్చిన కథనాన్ని గుర్తు చేశారు. భాజపా, ఫేస్​బుక్ ఇండియా మధ్య లాభదాయక ఒప్పందాలు జరిగినట్లు 'మరింత సమాచారం, మరిన్ని ఆధారాల'ను పత్రిక బయటపెట్టినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ లేఖ

"మీ సంస్థ తీసుకున్న చర్యల వివరాలేంటో చెప్పండి. భారత్​లో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రైవేటు లాభాల కోసం ఓ విదేశీ కంపెనీ భారత్​లో సామాజిక అసమ్మతి సృష్టించకుండా చర్యలు తీసుకుంటాం."

-కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత

మరోవైపు ఫేస్​బుక్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఫేస్​బుక్ ఉద్యోగులకు, పాలక వర్గం మధ్య ఉన్న సంబంధాలపై నిస్పాక్షిక దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి, ఏఐసీసీ డేటా అనలిటిక్స్​ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి పేర్కొన్నారు.

"ఓటర్ల అభిప్రాయాలను ఎలా మార్చేశారు, నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలను మాధ్యమంలో ఎందుకు అనుమతించారు అనే విషయాలపై దర్యాప్తు జరగాలి. విచారణ పూర్తయి, కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సంస్థ చర్యలు తీసుకునేంత వరకు వాట్సాప్​కు పేమెంట్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వకూడదు."

-ప్రవీణ్ చక్రవర్తి, కాంగ్రెస్ ప్రతినిధి

ఫేస్​బుక్ ఇండియాపై సంస్థ తీసుకున్న చర్యలు, దర్యాప్తు వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్.

ఇదీ చదవండి-'లేఖలో నాయకత్వ మార్పును కోరలేదు'

ABOUT THE AUTHOR

...view details