పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహన శ్రేణి వెళుతున్న ప్రాంతానికి భారీ పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం ఎలా చేరుకోగలిగిందని ప్రశ్నించారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా. 40మంది జవాన్లు మరణించిన విషాద ఘటన తర్వాత రెండు గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదని అన్నారు.
బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని ఖేరా తెలిపారు.
" ఆర్డీఎక్స్ పుల్వామాకు ఎలా చేరుకుంది?.. సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ఉండగా రోడ్డుపైకి ఆ వాహనాన్ని ఎందుకు అనుమతించారు?.. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3:10గం.లకు ఘటన జరిగితే సాయంత్రం 5:10గం. వరకు స్పందించకుండా ప్రధాని ఎక్కడికి వెళ్లారు? "అని ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు పవన్ ఖేరా. ఆ సమయంలో ప్రధాని ఫోటో షూట్లో బిజీగా ఉన్నారని మీడియా ద్వారా తమకు తెలిసిందన్నారు.