పార్లమెంట్ వర్షకాల సమావేశాల సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేపట్టింది కాంగ్రెస్. దివాలా చట్టం, పన్ను సహా ఇతర అంశాలకు సంబంధించిన 11 ఆర్డినెన్స్ల్లో నాలుగింటిని అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్ సమన్వయ కమిటీ గురువారం సమావేశమైంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయటంపై ఉభయ సభల స్పీకర్లకు లేఖ రాయాలని నిర్ణయించింది.
"రానున్న పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల్లో 15 సమస్యలను గుర్తించాం. అందులో కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగిత రేటు, భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తత, వలస కార్మికుల సమస్యలు, ధరల పెరుగుదల, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఫేస్బుక్ వివాదం వంటి ఇతర అంశాలు ఉన్నాయి. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాల మధ్య సమన్వయం కోసం ఇవే అంశాలపై ప్రశ్నిస్తోన్న పార్టీలతో చర్చించాం."