సమ్మోహనపరిచే నాయకత్వం లేదని గుర్తించడంలో వైఫల్యమే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఓ కారణమని మాజీ రాష్ట్రపతి , దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ పుస్తకంలో అభిప్రాయపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటలో మరింత తరచుగా మాట్లాడాలని సూచించారు. కన్నుమూయడానికి ముందు 'ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-2017' పేరిట ప్రణబ్ గత ఏడాది రాసిన పుస్తకం మంగళవారం విడుదలైంది. రూప పబ్లిషర్స్ ప్రచురించిన ఈ పుస్తకంలో ప్రణబ్ అనేక అంశాలను విశ్లేషించారు.
కాంగ్రెస్ వైఫల్యాలు..
కాంగ్రెస్ 2014లో ఓటమికి పాలవడానికి అనేక కారణాలను ప్రణబ్ తన పుస్తకంలో ప్రస్తావించారు. "2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజున నిరుత్సాహానికి లోనయ్యా. కాంగ్రెస్ 44 సీట్లు మాత్రమే సాధించడం నమ్మశక్యంగా అనిపించలేదు. ఆకర్షణీయ నాయకత్వాన్ని పార్టీ కోల్పోయిందని భావిస్తున్నాను. నెహ్రూ వంటి అగ్రనేతలు భారత్‌ను సుస్థిర దేశంగా అభివృద్ధి చేశారు. అలాంటి అసాధారణ నేతలు లేకపోవడం వల్ల కాంగ్రెస్ 'సగటు ప్రభుత్వాన్ని' అందించగలిగింది" అని ప్రణబ్ పుస్తకంలో పేర్కొన్నారు.
మోదీతో సుహృద్భావ సంబంధాలు..
"ప్రధాని మోదీతో సుహృద్భావ సంబంధాలుండేవి. అయితే సమావేశాల్లో విధానపరమైన అంశాల్లో సలహాలివ్వడానికి నెనెప్పుడూ సంకోచించలేదు. దేశాన్ని పాలించేందుకు మోదీ ప్రజల నుంచి నిర్ణయాత్మక తీర్పును పొందారు. మా ఇద్దరి మధ్య ఇబ్బందికర సందర్భాలు ఎదురైనా అవి సమసిపోతుండేవి. విభేదాలేమైనా ఉన్నా.. అవి బహిర్గతం కాకుండా ఎలా పరిష్కరించుకోవచ్చో మా ఇద్దిరకీ తెలుసు" అని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు.