మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ను సంభాజీనగర్‌గా పేరు మార్చే ప్రతిపాదనను కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి బాలాసాహెబ్ థోరట్ శనివారం పునరుద్ఘాటించారు. త్వరలోనే ఔరంగాబాద్ పేరు మార్పు జరుగుతుందని శివసేన స్పష్టం చేసినప్పటికీ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేరు మార్పు ప్రతిపాదన, విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోగించకూడదని థోరట్ చెప్పారు. ఇదే విషయమై ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభావం చూపలేదు
దీనిపై శివసేన స్పందించింది. కాంగ్రెస్ వైఖరి.. మహా వికాస్ ఆఘాడీ(ఎమ్వీఏ) ప్రభుత్వంపై ప్రభావం చూపబోదని తన పత్రిక 'సామ్నా' లో శనివారం ధీమా వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తిరస్కరణ.. ప్రతిపక్ష భాజపాను సంతోష పెట్టిందని పేర్కొంది. కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ.. కూర్చొని చర్చిస్తే సమస్య పరిష్కారమవుతుందని అందులో తెలిపింది.