కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రధాని నరేంద్రమోదీ ఘాటు విమర్శలు చేశారు. మాజీ ప్రధాన మంత్రులు అటల్ బిహారీ వాజ్పేయీ, పీవీ నర్సింహారావు చేసిన పనుల గురించి ఆ పార్టీ ఎప్పుడూ ప్రస్తావించలేదని కుండబద్ధలు కొట్టారు.
17వ లోక్సభ మొదటి సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా పలు అంశాలపై మాట్లాడారు ప్రధాని. గాంధీ కుటుంబేతర ప్రధానులపై ఆ పార్టీ నేతలు వివక్ష చూపారని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరునూ కాంగ్రెస్ ప్రస్తావించలేదని ఆరోపించారు.
"కొంతమంది పేరు చెప్పకపోతే ఎంతో బాధ పడతారు. మరి కొంత మంది అవమానంగా భావిస్తారు. మీకో విషయం చెబుతాను. 2004కు ముందు అటల్ బిహారీ వాజ్పేయీ ప్రభుత్వం ఉంది. 2004 నుంచి 2014 మధ్య పాలించిన నాయకులు అధికారిక కార్యక్రమంలో ఒక్కసారైనా వాజ్పేయీ పేరును వాడలేకపోయారు. అంతెందుకు పీవీ నర్సింహరావు పేరును ఉచ్ఛరించలేదు. అదీ కూడా కాదు.. వాళ్లు ఇంతసేపు మాట్లాడారు.. ఒక్కసారైనా మన్మోహన్ సింగ్ పేరు తీశారా?"
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ప్రజలది గొప్ప తీర్పు
మరో సారి ఎన్డీఏ అధికారంలోకి రావటంపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు సాక్షిగా సంతోషం వ్యక్తం చేశారు. జాతి, మతం, సంప్రదాయం, సంస్కృతులకు అతీతంగా ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజలు ఓటు వేశారని కితాబిచ్చారు.
"దేశంలో గొప్ప జనాభిప్రాయం వెలువడింది. రెండోసారి మాకు అధికారం అందించారు. అదీ గతంతో పోలిస్తే మరింత గొప్పగా. 2014లో అప్పటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఓ ప్రయోగం రూపంలో.. పోతే పోనీ వీళ్లకు ఓ సారి అవకాశం ఇద్దామనే ఆలోచనతో ప్రజలు ఓటు వేశారు. కానీ 2019లో చూస్తే పూర్తిగా మమ్మల్ని పరిశీలించి దాని ఆధారంగానే మాకు ఓటు వేసి మమ్మల్ని మళ్లీ ఇక్కడ కూర్చొబెట్టారు."