కీలక భేటీలతో ముగింపు దశకు మహా ప్రతిష్టంభన! మహా ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు.
మహా రాజకీయాలపై చర్చించడానికి నేడు కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు సమావేశంకానున్నారని వెల్లడించారు చౌహాన్. అనంతరం రేపు ఇరువర్గాలు.. శివసేన నేతలతో భేటీ అవుతాయని స్పష్టం చేశారు. మరోవైపు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన ఆ పార్టీ నేతలు రేపు భేటీకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించనున్నారు ఉద్ధవ్. ఈ రెండు సమావేశాల అనంతరం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కీలక ప్రకటన వెలువడే అవకాశముంది.
సీఎం ఎవరు?
కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైన వేళ.. ముఖ్యమంత్రి పీఠంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం కుర్చీ కోసమే మిత్రపక్షమైన భాజపాతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్-ఎన్సీపీ కూటమితో చేతులు కలిపింది సేన.
అయితే.. ముఖ్యమంత్రి పదవి కోసం రొటేషన్ పద్ధతిని అనుసరించే అవకాశముంది. తొలి రెండున్నరేళ్లు శివసేన, చివరి రెండున్నరేళ్లు ఎన్సీపీ సీఎం కూర్చీని పంచుకునే అవకాశముందని సమాచారం. కాంగ్రెస్ మాత్రం డిప్యూటీ సీఎం పదవిలోనే ఐదేళ్లు కొనసాగుతుందని తెలుస్తోంది.
అయితే... బుధవారం జరిగిన సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:- చంద్రయాన్-2: '500మీ. దూరంలో అలా జరిగిపోయింది'