రాజస్థాన్ రాజకీయం మరో మలుపు తిరిగింది. శాసనసభ సమావేశాల నిర్వహణకు అనుమతించకూడదని రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రాపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. సమావేశాల కోసం రాష్ట్రప్రభుత్వం.. గవర్నర్‌కు ఇప్పటికే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం లేదని వెల్లడించారు.
"మేం వచ్చే సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నాం. గవర్నర్ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం లేదు. గత రాత్రే శాసనసభ నిర్వహణకు ఆదేశాలు విడుదల అవుతాయని మేం భావించాం. దీనిపై రాత్రంతా వేచిచూసినప్పటికీ గవర్నర్ వద్దనుంచి ఎలాంటి స్పందన రాలేదు."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఆ పోస్టు గౌరవానికి భంగం కలగకుండా సభల నిర్వహణకు వెంటనే చర్యలు తీసుకోవాలని గహ్లోత్ కోరారు. లేదంటే తమ వర్గానికి చెందిన శాసనసభ్యులతో కలిసి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. అప్పటికీ సభల నిర్వహణపై స్పష్టత రాకపోతే.. ప్రజలు రాజ్‌భవన్‌ను ఘెరావ్ చేసే అవకాశం ఉందని.. దానికి బాధ్యత తమది కాదని చెప్పారు.