కాంగ్రెస్లో అంతర్గత ఎన్నికలు నిర్వహించే విషయమై పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ(సీఈఏ) మంగళవారం భేటీ అయింది. మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలో దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. అయితే కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇప్పుడే పూర్తయ్యే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కూడా కాంగ్రెస్కు నూతన సారథి రావడం కుదరదని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుల ఓటర్ జాబితాపై సీఈఏ కసరత్తులు చేస్తోంది. ఈ జాబితా 20-25 రోజుల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీన్ని కాంగ్రెస్ అధినేత్రికి పంపించిన తర్వాత.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని సీఈఏ సభ్యుడు తెలిపారు. సీడబ్ల్యూసీ ఆదేశాలు అందిన తర్వాతే ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దీనికోసం నెల రోజుల సమయం పడుతుందని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2017లో ఎన్నికైన రాహుల్ గాంధీ.. 2019లో తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను సీడబ్ల్యూసీ ఇప్పటికీ ఆమోదించలేదు. ఏఐసీసీ నిబంధనల ప్రకారం ఆయన పదవీ కాలం 2022తో ముగియనుంది.
"ఈసారి నిర్వహించే ఎన్నికలు మిగతా కాలానికి పూర్తి స్థాయి అధ్యక్షుడి కోసం జరుగుతాయి. ఈ ఎన్నికల నిర్వహణపై సంపూర్ణ అధికారం సీడబ్ల్యూసీదే."
-సీఈఏ సభ్యుడు