కాంగ్రెస్ సీనియర్ నేతల్లో 23 మంది ఇటీవల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాకు రాసిన సుదీర్ఘ లేఖపై.. అంతర్గతంగా పెద్ద దుమారమే చెలరేగింది. పార్టీలో నాయకత్వ లోపం, నిర్ణయాల లేమి తదితర అంశాలను వారంతా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. తాజాగా సంస్కరణలు మొదలుపెట్టింది. లోక్‌సభ, రాజ్యసభ కమిటీల్లో అనూహ్యంగా మార్పులు చేసింది. అయితే ఇందులో లేఖ రాసిన 23 మంది అసమ్మతివాదులకు చోటు దక్కకపోవడం గమనార్హం.
ప్రాతినిధ్యం లేనివారికి పదవులా...?
లోక్‌సభలో రవ్నీత్ సింగ్ బిట్టూకు విప్‌గా బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్ఠానం. లేఖ రాసిన వారిలో ఉన్న సీనియర్లు మనీశ్ తివారీ, శశి థరూర్‌కు మాత్రం చోటు దక్కలేదు.
రాజ్యసభలో చీఫ్ విప్‌గా జైరాం రమేశ్‌ను నియమించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌లపై మాట్లాడేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కన్వీనర్ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇందులో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్‌కు చోటివ్వలేదు. గులాం నబీ ఆజాద్‌కు బదులుగా రాహుల్ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌కు అవకాశం దక్కింది.