దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం అంశమై ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ మినార్ అంతకంతకూ పైకి దూసుకెళుతోందని.. కానీ అది అసమర్థత నిదర్శనమని అభివర్ణించారు.
"ఒక్కో నెలకు మోదీ మినార్ పైపైకి దూసుకెళుతోంది. అది అసమర్థతకు అంకితమిచ్చిన ఓ స్మారకం."
-రాహుల్ గాంధీ ట్వీట్
తన ట్వీట్‌తో నిరుద్యోగ రేటుకు సంబంధించిన ఓ రేఖాచిత్రాన్నిజత చేశారు రాహుల్. ఇందులో సెప్టెంబర్ కంటే అక్టోబర్‌లో నిరుద్యోగం పెరిగినట్లుగా చూపిస్తోంది.
మారుస్తామని చెప్పి మౌనమెందుకు?
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి అంతా బాగుందని ప్రచారం చేస్తే... ఆ మేరకు అన్ని విషయాలు సర్దుకోవని ట్వీట్ చేశారు.
"ఉద్యోగ కల్పన రేటు పెరిగినట్లు, నూతన ఉద్యోగాలు సృష్టించినట్లు ఎక్కడ నుంచి వార్తలు రావడం లేదు. పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాల కోతలు ప్రారంభించాయి. అంతా మారుస్తాం అన్నవారు ఇప్పుడు మౌనంగా కూర్చుంటున్నారు. ఎందుకు?"
-ప్రియాంక ట్వీట్
అమెరికా హ్యూస్టన్ వేదికగా... సెప్టెంబర్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో..'మీరు నన్ను హౌడీ మోదీ అని ప్రశ్నిస్తే భారత్‌లో అంతా సజావుగా ఉందని సమాధానం వస్తుంది.' అని పేర్కొన్నారు మోదీ. ఈ వ్యాఖ్యలపైనే ప్రియాంక విమర్శనాస్త్రాలు సంధించారు.