కాంగ్రెస్‌లో 'నాయకత్వ శూన్యత'పై ఆ పార్టీ బహిష్కృత నేత సంజయ్ ఝా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ సారథిని మార్చాలని పార్టీలోని 100 మంది నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాశారని సంజయ్ ఆరోపించారు. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితిపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
"పార్టీ అంతర్గత వ్యవహారాలపై నిరాశ వ్యక్తం చేస్తూ దాదాపు 100 మంది కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీకి లేఖలు రాశారు. రాజకీయ నాయకత్వాన్ని మార్చి, పారదర్శకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు."
-సంజయ్ ఝా ట్వీట్
అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఖండించారు. ఫేస్బుక్ వివాదం(భాజపాకు ఫేస్బుక్ అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల) నుంచి దృష్టి మరల్చేందుకే భాజపా ఈ విషయాలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
"ఫేస్బుక్-భాజపా లింకుల గురించి దృష్టిమరల్చేందుకు అసలు ఉనికిలోనే లేని లేఖల గురించి ప్రస్తావించాలని 'ప్రత్యేక తప్పుడు సమాచార గ్రూప్' వాట్సాప్‌లో ఆదేశించింది. భాజపా మనుషులు ఈ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నారు."