కేంద్ర ప్రభుత్వం మిడతల దాడులను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని, పంటల బీమా పథకం కింద రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే మిడతల దాడులతో నాశనమైన పంటలపై (గిర్దావారీ) సర్వే నిర్వహించి.. నష్టపోయిన రైతులందరికీ ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ కూడా ప్రకటించాలని పేర్కొంది.
"వ్యవసాయశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎమ్ఏ)కు చెందిన 'ప్రకృతి విపత్తు' నిర్వచనంలో మిడతల దాడిని చేర్చాలని, తద్వారా పంటల బీమా పథకం కింద రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది."
- రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
చప్పట్లే పరిష్కారమా?
'సాధారణంగా మిడతల దాడి జరిగినప్పుడు రైతులు, సామాన్య ప్రజలు... చప్పట్లు కొట్టడం లేదా ప్లేటు తిరగేసి దరువు వేయాలని చెబుతారు. అయితే మోదీ సర్కార్.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చప్పట్లు కొట్టాలని, ప్లేట్లపై దరువు వేయాలని చెబుతోంది. అలాగే మిడతలను తరిమి కొట్టడానికి కూడా ఇదే విధానం పాటించాలని చెబుతోంది. ఇంతకీ మోదీ ప్రభుత్వం దగ్గర మిడతల సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారం ఏమీ లేదా?' అని రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఈ మిడతల సమస్య నివారణను శాస్త్రీయ, హేతుబద్ధమైన పరిష్కారం కనుక్కోవాలని ఆయన అన్నారు.