పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, వాస్తావాధీన రేఖ అంశాలపై చర్చపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా పీఎం-కేర్స్ నిధులపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. భారత్- చైనాల మధ్య లద్దాఖ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నప్పటికీ చైనా కంపెనీలు పీఎం కేర్స్‌కు నిధులెలా ఇస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.
లద్దాఖ్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిసి కూడా, ఆ దేశం ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదంటూ మోదీ ప్రకటన విడుదల చేసి దేశ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని జైరాం మండిపడ్డారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేశారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ స్వయంగా సమాధానాలిచ్చారని జైరాం రమేశ్ గుర్తు చేశారు. ఈ అంశంపై దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కూడా ప్రశ్నించారన్నారు.