సభను అగౌరవపరిచారని ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. స్పీకర్‌ది నియంతృత్వ నిర్ణయమని ఆరోపించింది. దిల్లీ అల్లర్ల అంశాన్ని సభలో లేవనెత్తకుండా అణచివేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. ఇది స్పీకర్ నిర్ణయం కాదని, భాజపా ప్రభుత్వ నిర్ణయమని ఆరోపించారు. ప్రతీకార రాజకీయాలకు ఈ చర్య నిదర్శనమన్నారు. దిల్లీ అల్లర్ల అంశంపై పార్లమెంటులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్ఫష్టం చేశారు అధిర్. ఎంపీలపై సస్పెన్షన్ వేటు సరైనదో కాదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
తమను ఏడాది పాటు లోక్‌సభలో అడుగుపెట్టనివ్వకుండా చేసినా .. పార్లమెంటులో మాత్రం దిల్లీ అల్లర్లపై చర్చ జరగాల్సిందేనని సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ వెల్లడించారు.