బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన వేళ 16 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఎంపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఆమోదించారు. ఫలితంగా కాంగ్రెస్ బలం 114 నుంచి 92కు పడిపోయింది. 230 మంది సభ్యులున్న ఎంపీ శాసనసభలో 2 ఖాళీలు ఉండగా సభ్యుల సంఖ్య 206కు పడిపోయింది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 104 కాగా భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫలితంగా కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవటం ఖాయంగానే కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ ఎంపీ పీఠం ఎక్కే అవకాశం ఉంది.
ముందే చేయాల్సింది..
రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం ముందే తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు చౌహాన్. సుప్రీంకోర్టు జోక్యం లేకపోతే ఇప్పటివరకు దీనిని తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి వచ్చేదని అన్నారు.
సుప్రీం తీర్పు..
మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. శాసనసభలో శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ఎన్పీ ప్రజాపతిని ఆదేశించింది. బలపరీక్ష కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని స్పష్టం చేసింది.