కర్ణాటకలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చిన గవర్నర్, కోరిన యడ్యూరప్పపై కాంగ్రెస్, జేడీఎస్ విమర్శలు గుప్పించాయి. రాజ్యాంగ విరుద్ధంగా యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గవర్నర్ ఖూనీ చేశారని ఆరోపించారు ఇరు పార్టీల నేతలు.
అవినీతికి ప్రతిరూపం, మాజీ జైలు పక్షి అంటూ యడ్యూరప్పను ఎద్దేవా చేసింది కర్ణాటక కాంగ్రెస్. యడ్యూరప్ప జైలుకెళ్లగా ముగిసిన 2008-11 మధ్య కాలంలోని ఘోరమైన పాలనను కన్నడ ప్రజలు ఇప్పట్లో మరిచిపోలేరని వ్యాఖ్యానించింది.
'' 'అవినీతికి మారుపేరు, మాజీ జైలు పక్షి' యడ్యూరప్ప.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అద్భుతమైన నైపుణ్యంతో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారు.''
- కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్
ఎలాంటి సందేహం వ్యక్తం చేయకుండా.. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది జేడీఎస్.
''ముగ్గురు శాసనసభ్యులపై అనర్హత వేటుతో సభలో శాసనసభ్యుల సంఖ్య 222. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 112. అయినా.. 105 మంది ఎమ్మెల్యేలున్న యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను ఎలా కలుస్తారు. ''