తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభలో కాంగ్రెస్​కు సారథి లేరు, వ్యూహం లేదు!

నేటి నుంచి 17వ లోక్​సభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్​లో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తరపున లోక్​సభ పక్షనేతగా ఎవరు ఉంటారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రాహుల్​గాంధీ ఈ బాధ్యత స్వీకరించకపోతే, అధిర్ రంజన్​ చౌదరి, కె.సురేశ్, శశిథరూర్​, మనీశ్​తివారిల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.​

By

Published : Jun 17, 2019, 4:47 AM IST

Updated : Jun 17, 2019, 7:16 AM IST

కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత.... ఎవరు?

కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత.... ఎవరు?

నేడు పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్నా... కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ లోక్​సభ పక్షనేతను ప్రకటించలేదు. ఈ బాధ్యతలు పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ చేపడతారా, మరో నేతకు అప్పగిస్తారా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు.

16వ లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఖర్గే ఓటమి, లోక్​సభ పక్షనేత ఎన్నికపై రాహుల్​ మౌనం ఫలితంగా మరో నేతను పార్టీ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాహుల్​ కాకపోతే ఎవరు..?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ప్రస్తుతం లోక్​సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్​ పట్టుబడుతున్నారు. రాహుల్​ నిష్క్రమణను పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్​సభ పక్షనేతగా రాహుల్​గాంధీయే బాధ్యతలు చేపడతారా? లేదా మరొకరికి అప్పగిస్తారా? అన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

బంగాల్​ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్​ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కె.సురేశ్​లో ఒకరిని కాంగ్రెస్ లోక్​సభ పక్షనేతగా ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్​ నాయకులు శశిథరూర్​, మనీశ్ ​తివారీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

విధేయులకే అవకాశమా..?

కేరళ తిరువనంతపురం నుంచి హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న శశిథరూర్​, లోక్​సభ పక్షనేతగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు.
అయితే గాంధీ కుటుంబానికి విధేయుడు, హిందీ, ఆంగ్లభాషల్లో పట్టున్న నాయకుడు ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం జరుగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే శశిథరూర్​, మనీశ్​ తివారీల్లో ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉంది.

17వ లోక్​సభ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో సభపక్షనేతతో పాటు, డిప్యూటీ లీడర్​, చీఫ్ విప్, విప్ నియామకాలు చేపట్టాల్సి ఉంది.

ఉమ్మడి వ్యూహం కరవు!

బడ్జెట్​ సమావేశాల్లో అధికార భాజపాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎలాంటి సమావేశాన్ని నిర్వహించలేదు.

ఇదీ చూడండి: పార్లమెంటు సమావేశాలకు ముందు భాజపా భేటీ...

Last Updated : Jun 17, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details