తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'12 స్థానాల్లో గెలుస్తాం.. యడ్డీ రాజీనామా చేయాల్సిందే' - మరోసారి రసవత్తరంగా కన్నడ రాజకీయాలు

కర్ణాటక ఉపఎన్నికల వేళ.. అక్కడి ప్రధాన పార్టీలు తలోమాట మాట్లాడుతున్నాయి. 12 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని అంటున్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య. అది పగటికలే అని ఎద్దేవా చేశారు భాజపా రాష్ట్రాధ్యక్షుడు కాటీల్​. ఉపఎన్నికల తర్వాత.. భాజపా ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు దేవేగౌడ.

cong-will-win-at-least-12-seats-return-to-power-siddaramaiah
congs-patole-to-face-off-with-bjps-kathore-for-speakers-post

By

Published : Dec 1, 2019, 6:16 AM IST

Updated : Dec 1, 2019, 8:58 AM IST

'12 స్థానాల్లో గెలుస్తాం.. యడ్డీ రాజీనామా చేయాల్సిందే'

కన్నడ నాట రాజకీయాలు మరోసారి రసవత్తరంగా సాగుతున్నాయి. డిసెంబర్​ 5న అక్కడి 15 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయ ప్రచారంలో తలోమాట మాట్లాడుతున్నారు ప్రధాన పార్టీల నేతలు.

కర్ణాటక ఉపఎన్నికల్లో కనీసం 12 స్థానాల్లో విజయం సాధిస్తామంటున్నారు కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అప్పుడు రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యం అవుతుందన్నారు.

''మేం 12 స్థానాల్లో గెలుస్తాం. 15 చోట్ల నెగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒకవేళ మేం 12 స్థానాల్లో గెలిస్తే... భాజపా ప్రభుత్వం ఎలా మనుగడ సాగిస్తుంది. యడియూరప్ప రాజీనామా చేయాల్సిందే.''

- సిద్ధరామయ్య, కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో.. మెజార్టీ నిలుపుకోవాలంటే ఉపఎన్నికల్లో భాజపా కనీసం 6 చోట్ల నెగ్గాల్సిన అవసరముంది. లేకుంటే మరోసారి రాజకీయ సంక్షోభ పరిస్థితులు నెలకొనే అవకాశముంది.

ఇదీ చూడండి:కర్ణాటక: రెబల్​ ఎమ్మెల్యేల చుట్టూ ఉపఎన్నికల పోరు

సిద్ధరామయ్యది పగటి కలే: కాటీల్​

అధికారంలోకి వస్తామని సిద్ధరామయ్య పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు భాజపా రాష్ట్రాధ్యక్షుడు నళిన్​ కుమార్​ కాటీల్​. గత ఎన్నికల్లోనూ సీఎం అవుతానని ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. ఉప ఎన్నికల తర్వాత.. మరోసారి కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచగలదా..? అని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదు: దేవేగౌడ

కర్ణాటక ఉపఎన్నికల అనంతరం భాజపా ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవేగౌడ తెలిపారు. శనివారం ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని బలోపేతం చేసుకోవడంపైనే దృష్టి సారించనున్నట్లు చెప్పారు. రెండు జాతీయ పార్టీల (భాజపా, కాంగ్రెస్‌) స్వభావం ఒకటేనని.. వాటిని సమానంగా దూరం పెట్టడమే మేలని అన్నారు. ఉపఎన్నికల్లో15 స్థానాల్లో తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

''ఈ ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైతే తప్పనిసరిగా ప్రభుత్వ మనుగడకు జేడీఎస్‌ మద్దతు అవసరం. అదే సమయంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలవనంత వరకు భాజపా ప్రభుత్వానికి ముప్పు లేదు. అయినా ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌ ప్రణాళిక ఏంటనేది కూడా నాకు తెలియదు.''

- దేవేగౌడ, జేడీఎస్​ అధినేత

కర్ణాటక శాసనసభలో జులైలో నిర్వహించిన విశ్వాసపరీక్షలో 15 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించారు. అనంతరం.. ఎన్నికల సంఘం ఆయా స్థానాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. అనర్హులుగా ప్రకటించిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న సుప్రీం కోర్టు తీర్పుతో అనర్హత వేటు పడిన వారిలో 13 మంది భాజపా తరఫున బరిలో నిలిచారు.

ఇదీ చూడండి:ఉపఎన్నికల్లో 'అనర్హత' ఎమ్మెల్యేల పోటీకి మార్గం సుగమం

Last Updated : Dec 1, 2019, 8:58 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details