'మోదీ సిద్ధాంతం విభజించి, పాలించడం': సుర్జేవాలా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని విభజించి, పాలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రముఖ మ్యాగజైన్ 'టైమ్' తన తాజా అంతర్జాతీయ సంచికలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. ఇండియాస్ డివైడర్ ఇన్ ఛీఫ్ అంటూ పతాక శీర్షికను పెట్టింది. ఈ కథనాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ మోదీపై మాటల దాడికి దిగింది.
ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"మోదీ సిద్ధాంతం- దేశాన్ని విభజించి, పాలించడం. బ్రిటీష్వారి నుంచి భారతదేశానికి కాంగ్రెస్ విముక్తి కల్పించింది. ఇప్పుడు మోదీ నుంచి కూడా విముక్తి కల్పిస్తాం."- రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఎన్నికల వేళ...
టైమ్ మ్యాగజైన్ తన 2019, మే 20 అంతర్జాతీయ సంచికలో మోదీని ఉద్దేశిస్తూ, 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' అనే శీర్షికతో ఓ కథనం ప్రచురించింది. ఇది ఐరోపా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాలకు వెళ్లిన అంతర్జాతీయ సంచికలో ఉంది. ఈ కథనాన్ని రాసింది అతీష్ తసీర్.
ఈ కథనంలో భారత ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ వంశపారంపర్య పాలనా సూత్రం తప్ప దేశానికి మరేమీ అందించలేదని వ్యాఖ్యానించింది.
మరో కథనం 'మోదీ ది రిఫార్మర్'ని యూరేషియా గ్రూప్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడైన ఇయాన్ బ్రెమర్ రచించారు. భారత్లో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ కథనాలు ప్రచురితం కావడం గమనార్హం.
ఇదీ చూడండి: మరోసారి చిక్కుల్లో కాంగ్రెస్ నేత సిద్ధూ..