ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో మాహాకూటమికి ఎలాంటి నష్టం ఉండబోదని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కచ్చితంగా విజయావకాశాలు ఉన్న చోటే అభ్యర్థులను బరిలోకి దింపామని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకపోయినా... భాజపా అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బకొడతారని విశ్లేషించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేఠీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రియాంక.
భయంతో కాదు బాధ్యతతోనే...
ఓటమి భయంతోనే వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ నుంచి వైదొలిగారన్న వార్తలను కొట్టి పారేశారు ప్రియాంక. ప్రజలకు మంచి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను వారణాసి నుంచి పోటీ చేస్తే మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రచారం నిర్వహించే సమయం ఉండదనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు ప్రియాంక.
యూపీలో భాజపాను ఓడించి కాంగ్రెస్ను బలోపేతం చేయడమే తన ముందున్న కర్తవ్యమని ప్రియాంక అన్నారు. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి తాము ఆలోచించడం లేదని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో భాజపా ఓటమే తమ ధ్యేయమన్నారు ప్రియాంక.