దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించింది కాంగ్రెస్. ధరల పెంపునకు నిరసనగా సోమవారం (జూన్ 29న) దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపింది. ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రాలు అందజేస్తారని వెల్లడించింది.
కొవిడ్-19 సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలపై కేంద్రం ఏ విధంగా దోపిడీకి పాల్పడుతుందో ప్రజలకు చెప్పడమే ఈ ఆందోళనల లక్ష్యమని పేర్కొన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.
"జూన్ 30 నుంచి జులై 4వ తేదీ వరకు తాలూక, తహసీల్, బ్లాక్ స్థాయుల్లో కాంగ్రెస్ భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతుంది. వరుసగా 21 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. దీంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా ఆ ప్రయోజనాన్ని సామాన్యులకు ఇవ్వకుండా.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచుతూ భారీ లాభాలను కేంద్రం ఆర్జిస్తోంది."
- కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి