బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పాకిస్థాన్‌కు సాయం చేస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ చేసిన ప్రకటనల ఆధారంగానే ఆర్టికల్ 370 రద్దును ఐరాస భద్రత మండలిలో పాకిస్థాన్ సవాల్ చేసిందని పేర్కొన్నారు నడ్డా. కరోనా నియంత్రణలో పాక్ పనితీరును శశి థరూర్, రాహుల్ గాంధీ మెచ్చుకున్నారని అన్నారు. 'ఇదేనా మీ దేశభక్తి' అంటూ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నడ్డా పాల్గొన్నారు.
"అయోధ్య కేసులో తీర్పు ఇస్తే భాజపాకు లాభం కలుగుతుందని కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపణలు చేశారు. అలాంటి విమర్శలు చేసినప్పటికీ భాజపాకు భారీ విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. సుప్రీంకోర్టు కూడా మందిరానికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. ప్రజలు ఇచ్చిన అధికారంతోనే ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ మరింత ముందుకెళ్లారు."
-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
బిహార్ ఎన్నికల్లో భాగంగా మహాకూటమిలో కాంగ్రెస్ భాగం కావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు నడ్డా. వామపక్షాలు కూటమి ఏర్పరుచుకోవడంపై మండిపడ్డారు. సీపీఐ(ఎంఎల్) పార్టీని దేశాన్ని విభజించే ముఠా(తుక్డే తుక్డే గ్యాంగ్)గా అభివర్ణించారు. ఆర్జేడీ పార్టీలో మహ్మద్ షహబుద్దిన్ వంటి కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లు ఉన్నారని చెప్పారు.
"ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించనీయకుండా రాజకీయ సంస్కృతిలో మోదీ మార్పు తీసుకొచ్చారు. బిహార్‌లో మారిన పరిస్థితుల వల్ల తన తండ్రి లాలూ ప్రసాద్ ఫొటోలను పోస్టర్లపై ప్రచురించేందుకు తేజస్వీ యాదవ్ వెనకడగుడు వేస్తున్నారు. ఇదే లాలూ ఒకప్పుడు.. ఎన్నటికీ(సమోసాలో ఆలూ ఉన్నంతకాలం) బిహార్‌తోనే ఉంటానంటూ చెప్పుకున్నారు."
-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వ పనితీరు ఆదర్శవంతంగా ఉందని కొనియాడారు జేపీ నడ్డా. లాక్డౌన్ విధించిన సమయంతో పోలిస్తే దేశంలో కరోనా పరీక్షల ల్యాబ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు లేవని అన్నారు.
ఇదీ చదవండి-'సచిన్-సెహ్వాగ్‌లా మాది సూపర్ హిట్ జోడీ'