ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో ప్రియాంక గాంధీపై పోలీసులు దురుసుగా ప్రవర్తించటం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఆరోపించింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేసింది.
ప్రియాంక గాంధీ బాధ్యతాయుతమైన నాయకురాలని.. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా నడుచుకున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకురాలు సుష్మిత దేవ్. ప్రియాంక గాంధీ యూపీ పర్యటనపై నాటకీయ పరిణామాలు నెలకొన్న తరుణంలో దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు దేవ్.
" ప్రియాంక గాంధీ వెళ్లే వాహనంలో అయిదుగురి కన్నా తక్కువగా ఉన్నారు. అది 144 సెక్షన్ను ఉల్లంఘించినట్లు కాదు. ఉత్తర్ప్రదేశ్ పోలీసులు దేశ ప్రజలను కాపాడేందుకు ఉన్నారా? లేక వారిపై దాడులు చేసేందుకా? యూపీ పోలీసులు ఈ విధంగా గూండాగిరి చేస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఆందోళనకారులు, ప్రియాంక గాంధీలపై దాడికి పాల్పడటం, ద్విచక్ర వాహనాన్ని అడ్డుకోవటం, ఆమె వాహనం ప్రమాదానికి గురయ్యేలా చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి."