కాపలాదారు దొంగ అనే నిజాన్ని ఎవరూ మార్చలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల వేదికగా భాజపా ప్రారంభించిన ప్రచారంపై ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్.
రఫేల్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి "కాపలాదారుడే దొంగ" అని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు'నేనూ కాపలాదారునే' అని ట్విట్టర్ వేదికగా ప్రచారం ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. తన ట్విట్టర్ ఖాతా పేరుకు కాపలాదారు అని పేరు మార్చుకున్నారు. మరికొంత భాజపా నేతలు మోదీని అనుసరించారు.
ఈ వ్యవహారంపై రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం చౌకీదార్‌చోర్‌హై, మై భీ చౌకీదార్ పరస్పర వ్యాఖ్యలు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
"మీరు ఎంతైనా ప్రయత్నించండి. కానీ నిజం మాత్రం మారదు. ప్రతి భారతీయుడు చౌకీదార్ చోర్ అనే అంటాడు. సుష్మాస్వరాజ్‌ను ట్విట్టర్లో పేరు మార్చాలని ఒత్తిడి తెచ్చినట్టున్నారు. ఇది చాలా ఘోరం. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు