భారతలోని 10వేల మందికిపైగా ప్రముఖులు, సంస్థలపై చైనా నిఘా వ్యవహారాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావించారు కాంగ్రెస్ సభ్యులు. పొరుగు దేశం డిజిటల్ దుస్సాహసాలను ఎదుర్కొనేందుకు సరైన ఫైర్‌వాల్‌ను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాజ్యసభ శూన్యగంటలో 'చైనా నిఘా'పై కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ సభ్యులు కేసీ వేణు గోపాల్, రాజీవ్ సతావ్.
"చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధాలు ఉన్న షెన్జెన్లోని టెక్నాలజీ సంస్థ భారత్‌లోని 10వేల మంది ప్రముఖులు, సంస్థల సమాచారాన్ని సేకరించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. ఇందులో భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధామమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, సైన్యాధిపతి, పారిశ్రామికవేత్తలు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కీలక పదవుల్లో ఉన్న అధికారులు, న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, నటులు, క్రీడాకారులు, మత పెద్దలు, సామాజిక కార్యకర్తల సమాచారాన్నీ చైనా దొంగిలించింది. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అంశం. దీనిపై ప్రభుత్వానికి సమాచారం ఉందా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం."
- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీ.