దేశంలో హైకోర్టులు మరో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వ్యాఖ్యలు కోర్టులను భయభ్రాంతులకు గురిచేసేవిగా ఉన్నాయని మండిపడింది.
ఈ మేరకు కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అహంకార వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. గతంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా ప్రవర్తించిందన్నారు. ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పు చెప్పిన న్యాయమూర్తులను బదిలీ చేశారని ఆరోపించారు.
"ఈ వ్యాఖ్యలు న్యాయస్థానాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇది కచ్చితంగా అహంకార వైఖరి. ఇలాంటి అహంకారాన్ని ప్రభుత్వం ఇదివరకే ప్రదర్శించింది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో న్యాయస్థానాలకు తెలియాలి. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి సరైనవి కావు."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య 'భౌతిక దూరం' పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు కపిల్ సిబల్. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చెప్పలేకపోతోందని దుయ్యబట్టారు.
ప్రభుత్వాన్ని 'మార్చి'న తేదీ!
మార్చి 24న లాక్డౌన్ అమలు చేసిన క్షణం దేశానికి కీలకమైన మలుపు అని అన్నారు సిబల్. విభజన రాజకీయాలు చేసే అజెండా నుంచి ప్రజలు ప్రభుత్వం దృష్టిని మరల్చారని పేర్కొన్నారు. మార్చి 24కు ముందువరకు ఆర్టికల్ 370, ఎన్ఆర్సీ, సీఏఏ, ముమ్మారు తలాక్ తదితర అంశాలపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని... విద్య, వైద్యం వంటి పేదలకు ఉపయోగపడే విషయాలను విస్మరించిందన్నారు. గడిచిన ఆరేళ్లలో ప్రజా సమస్యలపై ప్రభుత్వం పనిచేసి ఉంటే భారత్ ఇప్పుడు మరో స్థాయిలో ఉండేదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిస్సహాయతను కరోనా మహమ్మారి బహిర్గతం చేసిందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:'భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరగట్లేదు'