'మహా'రాజకీయం: కాంగ్రెస్-ఎన్సీపీ సమావేశం వాయిదా మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇంకా ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. శివసేనకు మద్దతివ్వడంపై ఇవాళ కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య జరగాల్సిన సమావేశం రేపటికి వాయిదా పడింది.
సమావేశం వాయిదా పడడానికి.. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు తీరికలేకుండా ఉండడమే కారణమని చెప్పారు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని బుధవారానికి మార్చామని తెలిపారు.
శివసేనకు మద్దతుపై..
శివసేనకు మద్దతిచ్చే విషయాన్ని ఎన్సీపీతో చర్చించేందుకు కాంగ్రెస్.. అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా రాష్ట్రనేతలు తో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్సీపీ తరఫున జయంత్ పాటిల్, ప్రఫుల్ పటేల్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొంటారు.
సమయం పడుతుంది..
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబర్ మొదటి వారం వరకు స్వీయ గడువు విధించుకుంది శివసేన. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు శివసేన నేత సంజయ్ రౌత్. ప్రస్తుతమున్న అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే మరింత సమయం పడుతుందని చెప్పారు.
ఇదీ చూడండి:మరో 'పుల్వామా' దాడికి కుట్ర- భగ్నం చేసిన భద్రతా దళం