కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోని 15 కీలక హామీలు మీకోసం సంక్షిప్తంగా...
1. పేదరిక నిర్మూలనకు 'న్యాయ్'
పేద కుటుంబాలకు సంవత్సరానికి రూ.72వేల చొప్పున జీవన భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ. న్యూన్‌తమ్ ఆయ్ యోజన పేరుతో అమలు. మహిళల బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ.
2. యువత కోసం ఉద్యోగ విప్లవం
కాంగ్రెస్ ప్రథమ ప్రాధాన్యం... దేశంలోని యవతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ కల్పన. వచ్చే ఐదేళ్లలో 34 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వ రంగంలో కల్పిస్తామని వాగ్దానం చేశారు.
34లక్షల ఉద్యోగాల భర్తీ ఇలా...
⦁ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 2020 మార్చి నాటికి 4లక్షల ఉద్యోగాల భర్తీ.
⦁ 20లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గ నిర్దేశం చేయడం.
⦁ ప్రతి గ్రామ పంచాయితీ, పట్టణాభివృద్ధి సంస్థల్లో సేవామిత్ర ఉద్యోగాల ద్వారా 10లక్షల ఉద్యోగాల భర్తీ.
3. కిసాన్ బడ్జెట్
⦁ రైతులు, వ్యవసాయ కూలీలపై ప్రత్యేక దృష్టి.
⦁ రుణమాఫీతో సరిపెట్టకుండా రైతుల్ని రుణ విముక్తుల్ని చేయడమే అసలు లక్ష్యం.
⦁ రైతుకు పెట్టుబడి ధర తక్కువగా ఉండేందుకు చర్యలు
⦁ ఏటా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్- వ్యవసాయాభివృద్ధి కోసం శాశ్వత జాతీయ కమిషన్ ఏర్పాటు
4. యూనివర్సల్ హెల్త్‌కేర్
ఆరోగ్య సంరక్షణ హక్కు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వాసుపత్రుల్లోనే కాక, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, పరీక్షలు, ఔట్ పేషంట్ సేవలు తీసుకొస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. 2023-24 సంవత్సరం నాటికి ఆరోగ్య రంగానికి కేటాయింపులను జీడీపీలో 3 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది.
5. వస్తు సేవల పన్నులో సమూల మార్పులు
భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీని సరళతరం చేస్తామని చెప్పింది కాంగ్రెస్. యుద్ధప్రాతిపతికన సమూల మార్పులు చేస్తామని తెలిపింది. పంచాయితీ, మున్సిపాలిటీలకు జీఎస్టీలో వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
6. రక్షణ రంగంపై మరింత ఖర్చు
గత ఐదేళ్లలో దేశ రక్షణపై ఖర్చు తగ్గిందని కాంగ్రెస్ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే రక్షణ దళాలకు అవసరమైన విధంగా కేటాయింపులు ఉంటాయని హామీ ఇచ్చింది. రక్షణ రంగ ఆధునికీకరణ అత్యంత పారదర్శకంగా చేస్తామని వాగ్దానం చేసింది. పారా మిలిటరీ దళాలకు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత, విద్య, ఆరోగ్యం మొదలైనవి మెరుగుపరుస్తామని హామీ ఇచ్చింది.
7. 7వ తరగతి వరకు తప్పనిసరి ఉచిత విద్య
విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా విద్యావ్యవస్థ ప్రక్షాళనకు హామీ ఇచ్చింది కాంగ్రెస్. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి ఉచిత విద్య అమలు చేస్తామని వాగ్దానం చేసింది. 2023-24 నాటికి విద్యారంగానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది కాంగ్రెస్.