పార్లమెంటరీ కమిటీ సమావేశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్యానల్ భేటీలో తనను మాట్లాడేందుకు అనుమతించలేదని ఆరోపించారు. ఈ అంశంలో కలుగజేసుకోవాలని, పార్లమెంటరీ ప్యానెల్ సమావేశాల్లో ఎంపీలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కుకు భరోసా కల్పించాలని కోరారు.
పార్లమెంటు సంరక్షకుడిగా స్పీకర్.. రక్షణ రంగంపై ఏర్పాటైన ప్యానెల్లో చర్చలు దాని పాత్ర, లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూడాలన్నారు రాహుల్. 'కమిటీ చర్చలు పక్కదారి పట్టినప్పుడు ప్రశ్నించే హక్కు సభ్యునికి ఉంటుంది. నేను చెప్పినదానితో విభేదించేందుకు కమిటీ సిద్ధంగా ఉంది. కానీ, ఛైర్మన్ ఒక సభ్యుడిని మాట్లాడటానికి కూడా అనుమతించకపోవడం.. ప్రభుత్వం సైనిక వ్యవహారాలను ఎలా నిర్వహిస్తుందనే దానిని సూచిస్తోంది. ఇది విచారకరం' అని పేర్కొన్నారు రాహుల్.
రక్షణ రంగ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంట్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించగా.. భేటీ మధ్యలోనే వాకౌట్ చేశారు రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు. కీలక అంశాలు పక్కన పెట్టి జవాన్ల యూనిఫాంపై చర్చలు జరుపుతూ కమిటీ సమయాన్ని వృథా చేస్తోందని ఆరోపించారు.