దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల కోసం ప్రజలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కరోనా సమయంలో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్ చేశారు రాహుల్. #SpeakUpForStudentSafety హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసి వీడియో షేర్ చేశారు.
" లక్షల మంది విద్యార్థుల కోసం మీరూ గళం కలపండి. విద్యార్థులు చెప్పే విషయాన్ని ఫ్రభుత్వం వినాలని డిమాండ్ చేయండి."
-రాహుల్ గాంధీ
ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంపై గళమెత్తిన తమ పార్టీ నాయకుల వీడియోలను షేర్ చేసింది.
దేశవ్యాప్తంగా నిరసనలు..
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని ఈరోజు ఉదయం నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు.