పౌరసత్వ చట్ట వ్యతిరేక- అనుకూలవాదుల మధ్య దిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారటంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక సమర్పించింది ఆ పార్టీ నిజనిర్ధరణ కమిటీ. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడంలో కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని నివేదికలో పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
"దిల్లీ అల్లర్లలో సర్వస్వం కోల్పోయిన వారి సమస్యలను పరిష్కరించటంలో కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయి. పోలీసుల సమక్షంలో కొందరు భాజపా నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటమే అల్లర్లకు కారణం. హింసాత్మక ఘటనలను నిలువరించటంలో దిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు." అని నివేదికలో పేర్కొన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఐదుగురు సభ్యులతో కమిటీ..
పౌరసత్వ చట్టంపై ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లపై నిజానిజాలు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఇందులో పార్టీ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సుశ్మితా దేవ్, శక్తిసిన్హా గోహిల్, కుమారి సేల్జాలు ఉన్నారు.