ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాన్పుర్‌లో 8మంది పోలీసులను బలిగొన్న కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దుబే ఎన్కౌంటర్లో హతమవ్వడం వల్ల కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. దుబేకు సంబంధించిన ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. అప్పుడే అసలు నిజాలు ప్రజలకు తెలుస్తాయని మీడియా సమావేశంలో అన్నారు. దుబేకు రక్షణ కల్పించిన శక్తులు, ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ నేతలకు-నేరస్థులకు మధ్య సంబంధాల గురించి వాస్తవాలు వెలుగులోకి రావాలన్నారు.
దుబే అరెస్టయి కోర్టులో నోరు విప్పితే రాజకీయనేతలు, పోలీసులు, నేరస్థుల మధ్య సంబంధాలు బయట పడతాయనే భయంతో ఎన్కౌంటర్లో అతడిని హతం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు సుర్జేవాలా. దుబే లాంటి కరుడు గట్టిన నేరస్థుడు స్వేచ్ఛగా బయట తిరగడాన్ని గమనిస్తే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి భద్రతలకు ఏ విధంగా కట్టుబడి ఉందో అర్థమవుతోందని విమర్శించారు.