హాథ్రస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన పర్యటన అరెస్టులకు దారి తీసింది. గ్రేటర్ నోయిడా సమీపంలో పరిచౌక్ వద్ద వీరిని యూపీ పోలీసులు అడ్డగించి.. హాథ్రస్‌కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో అక్కడి నుంచి హాథ్రస్‌కు పాదయాత్ర ద్వారా 150 కిలోమీటర్లు వెళ్లాలని నిర్ణయించారు నేతలు. అయితే... ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీతో పాటు పర్యటనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, అధిర్ రంజన్ చౌదురి, రణ్‌దీప్ సుర్జేవాలాను గౌతమ్ బుద్ధ నగర్‌లోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌కు తరలించారు పోలీసులు.
తోపులాట..
అంతకుముందు... హాథ్రస్‌లో శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ విధిస్తూ స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో నేతలను అడ్డగించారు అధికారులు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
కాలి నడకన వెళుతున్న రాహుల్ గాంధీని యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రాహుల్, పోలీసుల మధ్య తోపులాట జరగగా.. ఆయన కింద పడిపోయారు.
సామాన్యుడికి అవకాశం లేదా?
పోలీసుల తీరుపై మండిపడ్డారు రాహుల్. తనను తోసివేసి పోలీసులు లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. "ప్రధాని మోదీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా? సామాన్యులకు అవకాశం లేదా?" అని ప్రశ్నించారు.