వలస కూలీల కష్టాలు, కార్మిక చట్టాల సంస్కరణలకు సంబంధించి ఇతర విపక్షాలతో చర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు భావసారూప్య పార్టీలు కలిసి రావాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
శుక్రవారం జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో 17 విపక్ష పార్టీల అధినేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
దేశమంతా పాదయాత్రలు..
లాక్డౌన్ కారణంగా చాలామంది వలస కూలీలు ఉపాధి కోల్పోవటం వల్ల స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అనేకమంది పాదయాత్రల ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ ప్రక్రియలో కొంత మంది మృత్యువాత పడ్డారు. ఈ సంక్షోభ సమయంలో వలస కూలీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.