భాజపాకు కాంగ్రెస్ '7 తీర్మానాల' సూచన అధికార భాజపా విధానాలను నిత్యం విమర్శించే కాంగ్రెస్.. నూతన ఏడాదిని పురస్కరించుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ కొత్త ఏడాదిలో భాజపా 7 తీర్మానాలు పెట్టుకుని, వాటిని అములు చేయడానికి కృషి చేయాలని సూచించింది.
ప్రజాస్వామ్య సూత్రాలను పాటించడం, పురాతన కాలంనాటి విధానాలకు స్వస్తి చెప్పడం, సత్యం పలకడం, ప్రచారాలపై వినియోగించే ఖర్చులు తగ్గించడం, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం-ఇతరులనూ ఆస్వాందించేలా ప్రోత్సహించడం, రాజ్యాంగాన్ని చదవడం, విదేశీ పర్యటనలను తగ్గించి స్వదేశంలో ఎక్కువ సమయం గడపటం వంటి 7 తీర్మానాలు కాషాయ పార్టీ అనుసరించాలంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా.. ఈ 7 తీర్మానాలను కఠినంగా పాటించడంలో సహాయం చేయడమే ఈ ఏడాది తాము ప్రభుత్వానికిచ్చే బహుమతని తెలిపింది.
"చాలా మంది సాధారణంగా వారి తీర్మానాలకు కట్టుబడి ఉండలేరు. కాని మెరుగైన ప్రజాస్వామ్య పాలన కోసం.. ఈ తీర్మానాలకు కట్టుబడి ఉండాలని మేము భాజపాను సూచిస్తున్నాం."
---కాంగ్రెస్.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం దేశంలోని ప్రధాన నగరాల్లో 144 సెక్షన్ విధించడం, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన శాంతియుత నిరసనలపై బలగాలను ప్రయోగించడం వల్ల భాజపాకు ప్రజాస్వామ్య విలువల పట్ల చిన్నచూపు ఉన్నట్టు ఆరోపించింది కాంగ్రెస్. అందుకే మొదటిగా ప్రజాస్వామ్య సూత్రాలు పాటించాలనే తీర్మానాన్ని సూచించినట్టు స్పష్టం చేసింది.
ప్రధాని విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ అనేకమార్లు మండిపడింది. అందుకే "మోదీ భారత్లో ఎక్కువగా ఉండండి" అంటూ విమర్శనాస్త్రాలు సంధించింది. పర్యటనలపై కాకుండా ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి సారించాలని సలహా ఇచ్చింది.
పాత కాలం నాటి విధానాలు, ఆలోచనలనే కమలనాధులు ఇప్పటికీ అనుసరిస్తున్నారని విమర్శించింది కాంగ్రెస్. మహిళా రిజర్వేషన్ బిల్లును భాజపా అమలు చేయకపోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యానాథ్ బిల్లును వ్యతిరేకించడాన్ని గుర్తిచేసింది.
నిర్బంధ కేంద్రాలు, ఎన్ఆర్సీ అంశంలో ప్రధాని మోదీ అనేక మార్లు అసత్యాలు పలికారని ఆరోపించింది హస్తం పార్టీ. మోదీ- షా మాటలకు ఎంతో వ్యత్యాసం ఉందంది. ఇకపై నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించింది.
వీటన్నిటినీ చూస్తుంటే రాజ్యాంగం పట్ల భాజపా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తునట్టు అర్థమవుతోందని పేర్కొంది కాంగ్రెస్. ఆ పార్టీ నేతలు ఎప్పుడూ రాజ్యాంగాన్ని చదవాలని స్పష్టం చేసింది.