తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ పోరు: సందిగ్ధంలోనే సీట్ల పంపకం - Bihar election updates

బిహార్​ ఎన్నికల పోరుకు ముందు ఆయా పార్టీలు తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి. సీట్ల పంపకంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మహాకూటమిలో అసమ్మతితో ఒక్కొక్కరు సభ్యులు కూటమిని వీడుతున్నా.. అసెంబ్లీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేదు. కొత్త పార్టీలు కూటమిలో చేరే అవకాశాలు కనిపించకపోగా.. పాత మిత్రులు మాత్రం అధిక స్థానాలు కావాలంటూ డిమాండ్​ చేస్తున్నారు.

Confusion prevails over seat sharing in Bihar election
సందిగ్ధంలోనే సీట్ల పంపకం

By

Published : Sep 29, 2020, 8:52 AM IST

బిహార్​ ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు కూడా సమయం లేదు. మరోవైపు అధికార, ప్రతిపక్ష కూటముల్లో సీట్ల సర్దుబాటు గందరగోళంగా మారింది. ఒక్కొక్కరు సభ్యులు కూటమిని వీడుతున్నా.."మహాగఠబంధన్​"లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పట్లో కొలిక్కివచ్చే సూచనలు కనిపించడంలేదు. కొత్త పార్టీలు మహాకూటమిలో వచ్చి చేరే పరిస్థితులు లేకపోగా.. పాత మిత్రులు ఎక్కువ సీట్లలో పోటీకి దిగుతామంటూ డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో సందిగ్ధత నెలకొంది.

గత ఎన్నికల్లో 81 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ) మహాకూటమిలో పెద్ద పార్టీ కావడం వల్ల.. మొత్తం 243 స్థానాలకు గానూ కనీసం 150 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపాలని దృఢ నిశ్చయంతో ఉంది. అయితే.. ఈ విషయంపై అసంతృప్తితో ఉన్న మిగతా పార్టీలకు నచ్చజెప్పడం ఆర్జేడీకి తలనొప్పిగా మారింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపైనా కూటమి సభ్య పార్టీలు పెదవి విరుస్తున్నాయి.

సీపీఐఎమ్​ఎల్​ ఆగ్రహం

ఈ నేపథ్యంలో హిందుస్థానీ ఆవామ్​ మోర్చా(సెక్యులర్​) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితన్​ రామ్​ మాంఝీ ఇప్పటికే కూటమిని వీడి ఎన్డీఏ గూటికి చేరారు. మరోవైపు తమకు 75స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్​ పట్టుపడుతోంది. ఆర్జేడీ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ కూడా తమకు బిహార్​లో పోటీ చేసేందుకు సీట్లు కేటాయించాలని కోరుతూ ఇప్పటికే రాంచీలో లాలూప్రసాద్​ యాదవ్​ను కలిశారు. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, సీపీఐఎమ్​ఎల్​లను కూటమిలోకి తెచ్చేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. అయితే.. తమకు కావలసిన స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ సుముఖంగా లేదని సీపీఐఎమ్​ఎల్​ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే.. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఎన్డీఏకు దూరంగా ఎల్​జేపీ

ఇప్పటివరకు ఎన్డీఏతో కలిసి ప్రయాణించిన లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ).. ఇకపై పొత్తు కొనసాగించేలా కనిపించడం లేదు. ఎన్​డీఏ కూటమిలోని జేడీయూ, ఎల్​జేపీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటులో ఇరు పార్టీలు తమ పట్టు సడలించేలా లేవు. 143 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో ఉంచాలని ఇప్పటికే ఎల్​జేపీ నిర్ణయించుకుంది. తన తండ్రి రామ్​విలాస్​ పాసవాన్​ ఆరోగ్యం గురించి.. సీఎం నితీశ్​ చేసిన వ్యాఖ్యలతో ఎల్​జేపీ నేత చిరాగ్​ పాసవాన్​ అసహనంతో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఎల్​జేపీ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

ఆ ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బందులు

మరోవైపు 2015 ఎన్నికల్లో జేడీయూ, భాజపా ఒకరికొకరు వ్యతిరేకంగా పోటీ చేసిన 51 స్థానాలు కూడా సీట్లు సర్దుబాటులో జాప్యానికి కారణమవుతున్నాయి. ఓట్ల శాతం ఆధారంగా స్థానాలు కేటాయించాలని భాజపా వర్గాలు కోరుతున్నాయి. అవే ఎన్నికల్లో భాజపా, ఎల్​జేపీ నాయకులను ఓడించిన ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం జేడీయూలో కొనసాగుతున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించడం నితీశ్​కు ఇబ్బందిగా మారింది.

150 స్థానాల్లో పోటీకి పప్పూ యాదవ్​ సై

బిహార్​ ఎన్నికల్లో 150 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని జన్​ అధికార్​ పార్టీ వ్యవస్థాపకుడు పప్పూ యాదవ్​ ప్రకటించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల పనితీరుతో బిహార్​ ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా కష్టపడి పనిచేసి ప్రజల అభిమానాన్ని సంపాదించారనే పేరు ఆయనకు ఉంది. అయితే.. ప్రజల్లో ఉన్న ఆ అభిమానాన్ని అసెంబ్లీ స్థానాల సంఖ్యగా మార్చుకుంటారా? అనే విషయమే ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చదవండి:

3 దశల్లో బిహార్​ ఎన్నికలు- నవంబర్​ 10న ఫలితం

బిహార్​ ఎన్నికల ఫైట్​​: ఎవరి సత్తా ఎంత..?

ABOUT THE AUTHOR

...view details