తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీ-ఎన్​పీఆర్​పై తొలగని సందేహాలు - CONFUSION IN INDIANS OVER NRC AND NPR

ఎన్‌ఆర్‌సీకి ఎన్‌పీఆర్‌ బాట వేస్తుందా? అనే ప్రశ్న దేశప్రజల్లో బలంగా నాటుకుపోయింది. రెండింటికీ సంబంధం లేదని కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా ఫలితం దక్కడం లేదు. ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రభావం చూపించడం లేదు.

CONFUSION IN INDIANS OVER NRC AND NPR
ఎన్​ఆర్​సీ-ఎన్​పీఆర్​పై తొలగని సందేహాలు

By

Published : Jan 2, 2020, 6:16 AM IST

Updated : Jan 2, 2020, 7:34 AM IST

జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)కు, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)కు ఏ మాత్రం సంబంధం లేదని, ఎన్‌పీఆర్‌ అనేది 2021 జనగణనలో అంతర్భాగమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఇటీవల పాత్రికేయుల సమావేశంలో స్పష్టీకరించారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) రూపకల్పనకు ఆధార్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్సుల సంఖ్యలను ఇవ్వడమనేది పౌరుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది తప్ప నిర్బంధమేమీ ఉండదని ఆయన వివరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన వివరాలను స్వీకరిస్తామే తప్ప ఎన్‌పీఆర్‌ పేరుతో అనుమానాస్పద వ్యక్తుల జాబితా తయారుచేసే ఆలోచనే లేదని చెప్పుకొచ్చారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను ముడిపెట్టే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. కానీ, 2003నాటి పౌరసత్వ (పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు పత్రాల జారీ) నిబంధనల్లోని మూడో నిబంధనకు చెందిన నాలుగో ఉప నిబంధన ప్రకారం జనాభా పట్టికలో తగు మార్పులు చేర్పులు చేయాలని ఈ ఏడాది జులై 31నాటి రాజపత్రం స్పష్టంగా పేర్కొంది. విశేషమేమంటే మూడో నిబంధనలోనే భారత పౌరుల జాతీయ పట్టిక (ఎన్‌ఆర్‌ఐసీ) భావన పొందుపరచి ఉంది. సదరు పట్టిక తయారీకి నాలుగో ఉప నిబంధన వీలుకల్పిస్తోంది.

కొత్త ప్రశ్నతోనే చిక్కు

నిజానికి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాములోనే, అంటే 2010లో మొట్టమొదటిసారిగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) కోసం సమాచారం సేకరించారు. 2011 జనగణన కోసం కూడా ఇంటింటి సమాచార సేకరణ ప్రారంభమైంది. వాటి ఆధారంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జాతీయ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు కూడా. 2010 ఎన్‌పీఆర్‌ సమాచారాన్ని 2015లో ఇంటింటి సర్వే సాయంతో క్రోడీకరించారు. 2021 జనగణన కోసం 2020లోనే ఇళ్లూ భవంతుల నమోదు ప్రారంభించి, దానితోపాటే ఎన్‌పీఆర్‌ను రూపొందించే పనినీ చేపట్టాలని నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయించింది. ఎన్‌పీఆర్‌ కోసం ప్రజలు ఇచ్చే సమాచారాన్ని స్వీకరిస్తామే తప్ప యక్షప్రశ్నలు వేయబోమని జావడేకర్‌ చెప్పుకొచ్చినా, ఇంతకుముందెన్నడూ అడగని ప్రశ్నను ఈసారి అడగబోతున్నట్లు తెలియవచ్చింది. అది-తల్లిదండ్రుల పుట్టిన స్థలం, తేదీలను తెలపాలని. దీంతో జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) గురించిన భయాలను మరింత ఎగదోస్తోంది. ప్రధాని మోదీ ఎన్‌ఆర్‌సీ తయారీపై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదని చెప్పినా ఆందోళనలు సద్దుమణగలేదు. ఎన్‌ఆర్‌సీ తయారీకి ఎన్‌పీఆర్‌ తొలి మెట్టు అనే అనుమానంతో కేరళలో సీపీఐ(ఎం) నాయకత్వంలోని ప్రభుత్వం, పశ్చిమ్‌ బంగలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ మార్పులుచేర్పుల ప్రక్రియను నిలిపి ఉంచాయి. ఎన్‌పీఆర్‌కు, 2021 జనగణనకు సంబంధమే లేదని మమత అంటున్నారు. ఇక కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వచ్చిన దరిమిలా ఎన్‌పీఆర్‌ క్రమంగా ఎన్‌ఆర్‌సీకే దారితీస్తుందని భావిస్తూ ఎన్‌పీఆర్‌ పనులను నిలిపేసింది. సీఏఏ కాందిశీకులకు పౌరసత్వం ఇవ్వడానికి మతాన్ని కొలబద్దగా తీసుకుంటుందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక మతవర్గంపై గురిపెట్టడానికి ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తుందనే అనుమానాన్ని ఓ ప్రతిపక్ష నాయకుడు వ్యక్తం చేశారు.

ఎన్‌పీఆర్‌ కోసం సమాచార సేకరణ జరిపేటప్పుడు ఒక నిర్దిష్ట మతవర్గంవారు తమ తల్లిదండ్రుల పుట్టుపూర్వోత్తరాలను సరిగ్గా చెప్పలేకపోతే, వారి వివరాలతో రహస్య జాబితా ఒకటి తయారుచేయవచ్చని, అవకాశం వచ్చినప్పుడు ఆ జాబితాలోనివారిని చొరబాటుదారులుగా ముద్రవేసే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. దీనిపై వ్యాఖ్యానించడానికి భారతీయ జనతా పార్టీ వర్గాలు నిరాకరించాయి.

పదేపదే వివరణలతో చల్లారని అనుమానాల వల్ల ఎన్‌పీఆర్‌ను తాజా సమాచారంతో రూపొందించాలని డిసెంబరు 24న కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ తరవాత కొద్దిగంటలకే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు సంబంధమే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఎన్‌ఆర్‌సీపై పార్లమెంటులో కాని, మంత్రివర్గంలో కాని చర్చ జరగలేని ప్రధాని మోదీ చెప్పిన సంగతిని షా గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వు వల్లనే అసోంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేశామని డిసెంబరు 22న దిల్లీ సభలో మోదీ వివరించారు. కానీ, కూలంకషంగా చర్చించిన తరవాత దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ రూపకల్పన చేపడతామని భాజపా ఉపాధ్యక్షుడు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ డిసెంబరు 23న ప్రకటించారు. సీఏఏని వ్యతిరేకిస్తున్న భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆయన విమర్శలు గుప్పించారు కూడా. పౌరసత్వమనేది కేంద్ర జాబితాలోని అంశం. సీఏఏ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా చట్టరూపం ధరించింది, దాన్ని పార్లమెంటు ఆమోదించింది కూడా. కాబట్టి ముఖ్యమంత్రుల నిరసనలతో నిమిత్తం లేకుండా దాన్ని అమలు చేసి తీరతామని చౌహాన్‌ స్పష్టం చేశారు. వారు ఆ చట్టాన్ని అమలు చేయడానికి మొరాయిస్తే ఇతర మార్గాల్లో దాన్ని కార్యరూపంలోకి తెస్తామన్నారు. ప్రధాని మోదీ అఖిల భారత ఎన్‌ఆర్‌సీ గురించి ఎన్నడూ చర్చించలేదనడం పట్ల ఎన్‌సీపీ నాయకుడు శరద్‌ పవార్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్లమెంటును ఉద్దేశించిరాష్ట్రపతి చేసిన ప్రసంగంలో ఎన్‌ఆర్‌సీ ప్రస్తావన ఉందని, రాజ్యసభలో అమిత్‌ షా కూడా అఖిల భారత ఎన్‌ఆర్‌సీని తీసుకొస్తామని చెప్పారని ఆయన గుర్తుచేశారు. భారత్‌ నుంచి అక్రమ చొరబాటుదారులను గెంటేయడానికి ఎన్‌ఆర్‌సీని ప్రవేశపెడతామని సీనియర్‌ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ నద్దా గతంలో చాలాసార్లు స్పష్టంగా ప్రకటించి ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు భాజపా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలోనూ ఎన్‌ఆర్‌సీని పొందుపరచారు.

నిర్వచనంలో మతలబు

యూపీఏ హయాములోనే ఎన్‌పీఆర్‌ కోసం తొలి అడుగు పడినా, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాతనే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ తయారీకి సాధికారంగా కృషి మొదలైంది. 2019 జులై 31న ఇందుకు గెజెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. భారత పౌరుల జాతీయ పట్టిక (ఎన్‌ఆర్‌ఐసీి) తయారీకి ఈ విధంగా తొలి అడుగు పడింది. అన్నట్లు జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) తయారీకీ 2003లో ఎన్డీయే హయాములోనే బీజం పడింది. ఇదంతా కాకతాళీయం కాదని వేరే చెప్పాలా? ఆ సంవత్సరం భాజపా నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పౌరసత్వ (పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు పత్రాల జారీ) నిబంధనలను వెలువరించింది. ‘గ్రామం లేక గ్రామీణ ప్రాంతం, పట్టణం లేదా వార్డు లేక పౌరుల నమోదు రిజిస్ట్రార్‌ గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల వివరాలతో కూడిన పట్టికను జనాభా పట్టికగా వ్యవహరించాలి’ అని సదరు నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ నిబంధనలు ఎన్‌ఆర్‌ఐసీని భారతదేశం లోపల, వెలుపల నివసిస్తున్న భారతీయ పౌరుల పట్టిక అని నిర్వచించాయి. తనిఖీ సమయంలో కొందరు వ్యక్తులు తాము భారత పౌరులమని నిర్ద్వంద్వంగా నిరూపించుకోలేకపోవచ్ఛు అటువంటి అనుమానాస్పద వ్యక్తుల గురించి లోతుగా విచారణ జరపాలని 2003నాటి నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కాబట్టి జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) అనుమానాస్పద వ్యక్తుల జాబితా తయారుచేసి, వారి పూర్వాపరాలను విచారించనుంది. ఇది చివరకు ముస్లిములకు వ్యతిరేకంగా పరిణమిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.
పేదల కోసమే ప్రయత్నాలు

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) ఆధారంగానే పేదలకు వివిధ ప్రభుత్వ పథకాల ఫలాలను అందిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వివరించారు. కాబట్టి ఎన్‌పీఆర్‌ను రాజకీయం చేయవద్దని కేరళ, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. వారి వ్యతిరేకత వల్ల పేదలకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఈ విషయమై పునరాలోచన చేయాలని కోరారు. ఎన్‌పీఆర్‌కు, ఎన్‌ఆర్‌సీకి మధ్య పేరు మార్పే తప్ప, మరే తేడా లేదని మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ వర్ణించడాన్ని షా ఖండించారు. భాజపా ఎడ్డెమంటే మజ్లిస్‌ తెడ్డెమనడం మామూలేనని ఈసడించారు. ‘సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని భాజపా అంటే, లేదు లేదు పడమర ఉదయిస్తాడని మజ్లిస్‌ అంటుంది. ఎన్‌పీఆర్‌ కూడా ఎన్‌ఆర్‌సీకి సంబంధం లేదని ఒవైసీజీకి నేను భరోసా ఇస్తున్నా’ అని షా పేర్కొన్నారు. ఎన్‌పీఆర్‌ అనేది భాజపా ఎన్నికల ప్రణాళికలో లేనేలేదని, గతంలో కాంగ్రెస్‌ ప్రారంభించిన కార్యక్రమాన్ని తాము కొనసాగిస్తున్నామని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ హయాములో ఎన్‌పీఆర్‌ కోసం సమాచార సేకరణ జరిగిన మాట నిజం. 2011 జనగణన కోసం ఇళ్లూ భవంతుల చిట్టా తయారీని 2010లో చేపట్టారు. తరవాత అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జాతీయ గుర్తింపు పత్రాలను జారీచేశారు. అయితే అదంతా లాంఛనప్రాయమేనని చెప్పాలి.

- రాజీవ్‌ రాజన్‌

Last Updated : Jan 2, 2020, 7:34 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details