భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ప్రణబ్ ముఖర్జీ మృతితో ఒక శకం ముగిసింది రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఓ గొప్ప కుమారుడిని కోల్పోయినందుకు దేశం విలపిస్తోందని అన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎన్ని అత్యున్నత పదవులు చేపట్టినా.. ఒదిగే ఉన్నారని పేర్కొన్నారు.
"మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్త వినడం విచారకరం. అయన మరణంతో ఒక శకం ముగిసింది. ప్రజా జీవితంలో ఓ గొప్ప వ్యక్తి ప్రణబ్. దేశం తన విలువైన కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి."
-రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు మరింత దగ్గర చేశారని కోవింద్ కితాబిచ్చారు. ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్‌ను తెరిచారని చెప్పారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య విచారం..
ముఖర్జీ మరణంతో దేశం ఓ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృషి, పట్టుదల, అంకితభావంతో దేశంలోని అత్యున్నత స్థానాన్ని అధిరోహించారని కొనియాడారు.
"సుదీర్ఘమైన ప్రజా సేవలో ముఖర్జీ నిర్వర్తించిన ప్రతీ పదవికి గౌరవం తీసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా."
-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మోదీ దిగ్భ్రాంతి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, మేధావిని ఈ దేశం కోల్పోయిందని అన్నారు. దేశాభివృద్ధిలో ప్రణబ్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారని కొనియాడారు. రాజకీయాలు, వర్గాలకు అతీతంగా ప్రణబ్ అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు.
తాను ప్రధానిగా బాధ్యతల స్వీకరణ సమయంలో ప్రణబ్ తనను ఆశీర్వదించినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. దిల్లీకి వచ్చినప్పుడు మార్గదర్శనం చేశారని తెలిపారు.
"రాష్ట్రపతి భవన్‌ను సంస్కృతి, విజ్ఞాన, సాహిత్య కేంద్రంగా ప్రణబ్ ముఖర్జీ తీర్చిదిద్దారు. కీలక విధాన విషయాలపై ఆయన తెలివైన సలహాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో దీర్ఘకాలిక కృషి చేశారు. ఆయన అత్యుత్తమ పార్లమెంట్ సభ్యుడు. ఆయన కుటుంబ సభ్యులకు, దేశవ్యాప్తంగా మద్దతుదారులకు సంతాపం. ఓంశాంతి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ముఖర్జీకి పాదాభివందనం చేస్తున్న ఫొటోను పంచుకున్నారు మోదీ.
ప్రణబ్‌కు మోదీ పాదాభివందనం చేస్తున్న చిత్రం( ఫైల్)
హోంమంత్రి షా..
ముఖర్జీ మరణంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని అన్నారు. మాతృభూమికి ప్రణబ్ ఎనలేని సేవలు చేశారని కితాబిచ్చారు. ఆయన కృషి చెరిగిపోనిదని.. ముఖర్జీ మరణం భారత రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు.
నేపాల్ ప్రధాని..
ప్రణబ్ ముఖర్జీ మరణంపై నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సైతం స్పందించారు. నేపాల్ ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందని అన్నారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. భారత ప్రజలకు, ప్రభుత్వానికి సంతాపం తెలిపారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. దేశానికి శ్రద్ధాభక్తులతో సేవచేశారని అన్నారు. పార్టీలకు అతీతంగా ఆయన ఆదరణీయుడని పేర్కొన్నారు.
ఇవీ చదవండి