మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని భాజపా ఎంపీ, సాధ్వీ ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలు చేయడంపై పెను దుమారం రేగింది. ఈ వ్యవహారంపై చర్చ కోరుతూ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రగ్యాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌ను ఉగ్రవాద పార్టీగా ప్రగ్యా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి కాంగ్రెస్ చేసిన సేవలు మరువలేనివని స్పష్టం చేశారు.
"వేలమంది కాంగ్రెస్ సభ్యులు దేశానికి సేవచేస్తూ చనిపోయారు. కాంగ్రెస్ గురించి అలా మాట్లాడేందుకు ఆమెకు ఎంతధైర్యం? అదీ సభలో. మేం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. "
-అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ పక్షనేత
రాజ్‌నాథ్ వివరణ
ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలు భాజపాను రక్షణాత్మక ధోరణిలో పడేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.
"నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పిలవడం కాదు... కనీసం ఆ ఆలోచన కూడా రానీయకూడదు. ప్రగ్యా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మహాత్మాగాంధీ మనకు మార్గదర్శకుడు. మార్గదర్శకుడిగానే ఉంటారు. ఆయన ఆలోచనలు నాడు, నేడు, ఎప్పటికీ ఆచరణీయం. జాతి, వర్గ భేదం లేకుండా అందరికీ ఆయన ఆదర్శప్రాయులు. వారి నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటారు."
-లోక్‌సభలో రాజ్‌నాథ్‌సింగ్