భారత్- చైనా మధ్య చర్చల పురోగతికి పాంగాంగ్ సరస్సు సమస్య తీవ్ర అడ్డంకిగా మారింది. భారత్- చైనా మధ్య ఆదివారం జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లోనూ పాంగాంగ్ విషయమే సమస్యగా మారిందని ఈటీవీ భారత్తో ఓ సైనికాధికారి వెల్లడించారు.
"రెండు దేశాల మధ్య ఇంకా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సి ఉంది. పాంగాంగ్ ఉత్తర ప్రాంతం ముఖ్యమైనది. ఫింగర్ 5 నుంచి చైనా వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. కానీ, ఫింగర్ 4 వద్ద తన స్థావరాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించటం లేదు."
- సైనికాధికారి
సరిహద్దుల్లోని చుశుల్-మోల్డో ప్రాంతంలో ఆదివారం భారత్, చైనా మధ్య ఐదో దఫా కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు దేశాలు వారి అజెండాలపై దృఢంగా నిలవటం వల్ల పరిష్కారానికి సవాలుగా మారుతోంది. ఈ సమావేశ వివరాలను పొందిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వంలోని చైనా స్టడీ గ్రూప్ చర్చించింది.