తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ సర్వే తప్పు- సామాజిక వ్యాప్తి దశకు కరోనా'

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి ఎప్పుడో ప్రారంభమైందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించడంలో మొండిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సామాజిక వ్యాప్తి లేదని భారత వైద్య పరిశోధనా మండలి చేసిన ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

By

Published : Jun 13, 2020, 4:20 PM IST

Community transmission of COVID-19
'మూర్ఖత్వం వీడి సామాజిక వ్యాప్తి ఉందని గుర్తించాలి'

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్​ బారిన పడ్డవారి సంఖ్య రోజుకో రికార్డు సృష్టిస్తోంది. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) మాత్రం దేశంలో సామాజిక వ్యాప్తి లేదనే చెబుతోంది. సంస్థ నిర్వహించిన సీరో-సర్వేలో ఈ విషయమే తేలిందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: భారత్​లో సామూహిక వ్యాప్తి లేదు: ఐసీఎంఆర్​

అయితే.. ఈ సర్వే ఫలితాలపై నిపుణులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి ఉందని కుండ బద్దలుకొట్టారు. ఈ నిజాన్ని అంగీకరించడంలో ప్రభుత్వం మూర్ఖత్వంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

"దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఆంక్షలు సడలించినందున కేసులు లేని ప్రాంతాలకూ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. తద్వారా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటారు."

-డా. ఎంసీ మిశ్రా, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

భారీ జనాభా ఉన్న ఇంత పెద్ద దేశంలో 26,400 మందిపై చేసిన సర్వేతో వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేమని పేర్కొన్నారు మిశ్రా.

'ఎప్పుడో ప్రారంభమైంది'

చాలా రోజుల క్రితమే భారత్.. సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ప్రముఖ వైరాలజీ నిపుణులు షాహిద్ జమీల్ అన్నారు.

"అధికారులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. ఐసీఎంఆర్ నిర్వహించిన తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్​నెస్​-సారీ) సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. వైరస్ బారిన పడ్డ 40 శాతం మంది బాధితులు కరోనా రోగులతో కలవడం గానీ, విదేశీ ప్రయాణాలు గానీ చేయలేదు. ఇది సామాజిక వ్యాప్తి కాకపోతే మరేంటి?"

-షాహిద్ జమీల్, వైరాలజీ నిపుణులు

మరి.. దిల్లీ, ముంబయిలో?

ఐసీఎంఆర్​ వాదనను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ... దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి లేదనడం అవాస్తవమని న్యూరో సర్జన్ డాక్టర్ అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. భారత్​ చాలా సువిశాలమైన దేశం కాబట్టి ఒక్కో ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ఒక్కో విధంగా ఉందన్నారు. వైరస్ కేసులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయని చెప్పారు. ఏప్రిల్​ నెలలో నిర్వహించిన సర్వేను ఆధారంగా చేసుకొని దేశంలో సామాజిక వ్యాప్తి లేదని అనడం తప్పుడు ప్రకటనే అని స్పష్టం చేశారు.

'అందుకే కాంటాక్ట్ ట్రేసింగ్ నిలిపివేత'

సామాజిక వ్యాప్తి జరుగుతుందని ప్రభుత్వానికి తెలిసే.. కాంటాక్ట్ ట్రేసింగ్​లను నిలిపివేసిందని ఫరీదాబాద్​ ఫోట్రిస్ ఎస్కార్ట్స్​ పల్మనాలజీ విభాగాధిపతి డా. రవి శేఖర్ ఝా వ్యాఖ్యానించారు. వైరస్​ కేసులు లేని ప్రదేశాల్లోనే సీరో-సర్వే చేపట్టారని అన్నారు. దిల్లీ, ధారావీ లాంటి ప్రాంతాల్లో అధ్యయనం చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఇంతకుముందు అత్యంత పకడ్బందీగా కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించిన ప్రభుత్వం.. ప్రస్తుతం అలా చేయడం ఆపేసింది. గత 7-10 రోజుల్లో దిల్లీ సహా దేశంలోని ఏ ఒక్క ప్రదేశంలోనూ కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించ లేదు. ఎందుకంటే సామాజిక వ్యాప్తి జరుగుతోందని వారికి తెలుసు. కానీ ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. సరైన ప్రదేశాల్లో సర్వే చేయకుంటే.. అసలు సర్వేకు అర్థమే ఉండదు. కచ్చితంగా ఇది(సర్వే) ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదు. ఏప్రిల్ చివరి నాటికి(కేసుల విషయంలో) మనం మంచి స్థితిలోనే ఉన్నాం."

-డా. రవిశంకర్ ఝా, పల్మనాలజీ నిపుణులు

మొండిగా ఉండటంలో అర్థం లేదు

కరోనాను ఎదుర్కోవడంలో నిజాన్ని విస్మరించి, మొండిగా వ్యవహరించడమే ప్రభుత్వ విధానమైతే.. అందులో అర్థం లేదని జవహర్​లాల్ యూనివర్సిటీ సహాయ ఆచార్యులు డా. వికాస్ బాజ్​పాయ్ అన్నారు. ఐసీఎంఆర్​ సర్వేపై అసంతృప్తి వ్యక్తం చేశారు బాజ్​పాయ్. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కంటైన్​మెంట్ జోన్ల సమాచారం లేకపోతే సర్వేలో వచ్చిన ఫలితాలు వాస్తవాన్ని ప్రతిబింబించేలా ఉండవని పేర్కొన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించినా... ఇన్ఫెక్షన్​కు మూలాలను కనిపెట్టలేకపోతే సామాజిక వ్యాప్తి దశ మొదలైనట్లేనని వివరించారు.

దేశం మొత్తం లేకున్నా...

దేశవ్యాప్తంగా సామాజిక వ్యాప్తి ఉందనడం సరికాదని గురుగ్రామ్​లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చి ఇన్​స్టిట్యూట్​ పల్మనాలజీ విభాగాధిపతి డా. మనోజ్​ గోయల్ అన్నారు. అయితే దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి కచ్చితంగా ఉందని తేల్చి చెప్పారు.

ఏంటీ ఐసీఎంఆర్ సర్వే?

భారత్​లో కరోనా సామాజిక వ్యాప్తి లేదని గురువారం ప్రకటించారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. వైరస్ సంక్రమణంపై నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించారు. సర్వేలో భాగంగా 83 జిల్లాల్లోని 26,400 మందిపై పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 65 జిల్లాల సమాచారం క్రోడీకరించినట్లు చెప్పారు. ఇందులో 0.73 శాతం మంది మాత్రమే వైరస్​ బారిన పడ్డట్లు తెలిపారు. జిల్లాలను నాలుగు వర్గాలు(సున్నాకేసులు, తక్కువ వ్యాప్తి, సాధారణ వ్యాప్తి, అధిక వ్యాప్తి)గా విభజించినట్లు బలరాం వెల్లడించారు.

ఏప్రిల్ 25 నాటికి నమోదైన కేసుల ఆధారంగా మే మూడో వారంలో సర్వే నిర్వహించినట్లు కరోనా సాధికార కమిటీ ఛైర్మన్, నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ తెలిపారు. ఇన్ఫెక్షన్​కు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి చెందడానికి కనీసం 15 రోజులు పడుతుందని అన్నారు. హాట్​స్పాట్​ నగరాల్లోని కంటైన్​మెంట్ జోన్లలో సర్వే ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details