నిరుద్యోగం ఓవైపు, నైపుణ్యాల కొరత మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఏటా పట్టభద్రులై విద్యాసంస్థల నుంచి బయటికి వస్తున్న లక్షల మందికి ఉద్యోగాలు దొరకడం లేదు. అటు దేశ పారిశ్రామిక వర్గాలు నిపుణులైన పనిమంతులు దొరకడం లేదని నిట్టూరుస్తున్నాయి. నైపుణ్యలేమి పట్టభద్రులకు, పరిశ్రమలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తోంది. 2020 నాటికి భారతదేశ పౌరుల సగటు వయసు 27 సంవత్సరాలు. చైనా, అమెరికా (37), ఐరోపా, జపాన్ (48)లతో పోలిస్తే ఉరకలెత్తే యువతరం ఉండటం భారత్‌కు ఎంతో మేలు చేయనుందని పదేళ్ల కిందటే లెక్కలు కట్టారు. అయితే లెక్కకుమిక్కిలి యువత ఉన్నా వారికి వృత్తిగతమైన నైపుణ్యాలు అరకొర కావడంతో పారిశ్రామిక ప్రగతిలో భారత్ స్థానం మెరుగుపడటం లేదు. మార్కెట్లో ఉన్న ఉద్యోగావకాశాలకు, భారతీయ యువత నైపుణ్యాలకూ పొంతన ఉండటం లేదని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం ఛైర్మన్ గిన్నీ రొమెట్టీ నిరుడు వ్యాఖ్యానించారు. పదో తరగతి తరవాత చాలామంది పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో వృత్తి విద్యా కోర్సులు చేస్తుంటారు. దేశ పారిశ్రామిక అవసరాల కోసం దిగువ స్థాయి నిపుణులను అందించే ఈ ఐటీఐల నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారుతోంది. విద్యార్థులు రాకపోయినా తృణమో పణమో పుచ్చుకుని వారిని ఉత్తీర్ణులను చేయించి ధ్రువపత్రాలు చేతికిచ్చి పంపేస్తున్న సంస్థలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. అందుకే ఐటీఐ పట్టభద్రుల్లో అత్యధిక మంది పారిశ్రామిక సంస్థల్లో కొలువులు సాధించలేకపోతున్నారు. ఐటీఐల్లో నాణ్యతను పెంచేందుకు దశాబ్దాలుగా ప్రభుత్వం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. 2007-08లో దేశంలోని 400 ఐటీఐలను ఆధునీకరించేందుకు ప్రపంచబ్యాంకు రూ.2,500 కోట్ల సాయం అందించింది. అయినా వాటి పరిస్థితి మెరుగుపడకపోగా ఈ పుష్కర కాలంలో మరింత దిగజారింది.
ఇంజినీరింగ్ నాణ్యతకు నీళ్లు
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2018-19 నివేదిక ప్రకారం దేశంలో ఏటా 37.70 లక్షల మంది ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. ఇందులో కనీసం సగం మంది ఉత్తీర్ణులవుతున్నారనుకున్నా 20 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు ఉద్యోగాల కోసం విపణిలోకి వస్తున్నారు. వీరిలో అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారిని కంపెనీలు ప్రాంగణ నియామకాల్లోనే ఎంపిక చేసేసుకుంటున్నాయి. వృత్తిపర నైపుణ్యాల్లో వెనకబడిన వారికి కొలువులు దక్కడం గగనమైపోతోంది. కోయంబత్తూరు నగరపాలక సంస్థలో స్వీపర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో మైక్రోబయాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన ఓ యువతి, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన ఓ యువకుడు ఉన్నారు. ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన ఇంజినీరింగ్ కళాశాలలు సరైన అధ్యాపకులు, మౌలిక వసతులు లేకుండానే విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వారు పరీక్షలు గట్టెక్కుతున్నారు గానీ నైపుణ్యాన్ని సంతరించుకోలేక పోటీ ప్రపంచంలో వెనకబడిపోతున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత ఉన్న ఉద్యోగాలకూ వీరు పోటీపడుతుండటంతో ఆ స్థాయి విద్యార్హతలున్న వారికి కొలువులు దక్కడం లేదు. 2020 నాటికి ఆటోమేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా అయిదు లక్షల వైట్ కాలర్ (ఉన్నతస్థాయి) ఉద్యోగాలు పోతాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2018లో అంచనా వేసింది. అంటే ఆ స్థానంలో కొత్త రకం కొలువులొస్తాయన్నమాట. 2022నాటికి దేశంలోని 24 ప్రాధాన్య రంగాల్లో దాదాపు 10.90 కోట్ల మంది నిపుణులైన పనివారు అవసరమవుతారని ఓ అంచనా. తోళ్ల పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమ, ఆటొమొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాల తయారీ పరిశ్రమలు ఈ ప్రాధాన్య జాబితాల్లో ఉన్నాయి. దేశంలోని పనివారిలో కేవలం 2.3శాతం మంది మాత్రమే అధికారికంగా నైపుణ్య శిక్షణ పొందినవారు ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య యూకేలో 68, జర్మనీలో 75, జపాన్‌లో 80 శాతం మందికి అధికారికంగా నైపుణ్య శిక్షణ అందుతోంది. ఏటా 45 లక్షల మందికి మించి నైపుణ్య శిక్షణ ఇచ్చే మౌలిక వసతులు మన విద్యావ్యవస్థలో లేకపోవడం నైపుణ్య భారత్ లక్ష్యసాధనలో భారత్‌కు ప్రధాన అవరోధంగా ఉంది.