పౌరసత్వ చట్టంపై ఈశాన్య దిల్లీలో ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు దిల్లీ వీధులపై విరుచుకుపడ్డారు. పలు దుకాణాలను దగ్ధం చేశారు. రాళ్ల దాడులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. మరో 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాలు ఈనెల 23న చేపట్టిన ఆందోళనలతో దిల్లీలో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి.
ఘర్షణలతో చాంద్బాఘ్, భజన్పుర్, గోకుల్‌పురి, మౌజ్‌పుర్, కర్దాంపురి, జాఫ్రాబాద్ ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. కొన్ని చోట్ల సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఒకరిపై ఒకరు పెట్రోల్ బాంబులను విసురుకున్నారు. యథేచ్చగా విధ్వంసాలకు పాల్పడ్డారు.
నిరసనలకు కేంద్రమైన మౌజ్పుర్లో రహదారులపై టైర్లు తగలబెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఈ ఆందోళనల్లోనే 180 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో పోలీసులూ ఉన్నారు. వార్తల సేకరణకు వెళ్లిన ఓ పాత్రికేయునికి బుల్లెట్ గాయాలయ్యాయి. మరో ఇద్దరిపైనా దాడి జరిగింది.
రంగంలోకి హోం మంత్రి..
ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో స్వయంగా రంగంలోకి దిగారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. 24 గంటల వ్యవధిలో 3 కీలక భేటీలు నిర్వహించారు.
మంగళవారం రాత్రి 7 గంటలకు దిల్లీ పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు అమిత్ షా. నూతనంగా నియమితులైన దిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్(శాంతి భద్రతలు) ఎస్ఎన్ శ్రీవాస్తవ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం సాగింది.
కేజ్రీవాల్, ఎల్జీతో షా భేటీ...
అంతకుముందు దిల్లీ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు షా. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, వివిధ పార్టీల ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు.