ఉత్తరాది రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని దిల్లీ, జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనితో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు ఉంటున్న నేపథ్యంలో దారి కనిపించక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
దిల్లీలో...
దిల్లీలో పగటి పూట అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతే 9.4గా రికార్డయింది. గత వారం నుంచి దిల్లీలో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న కారణంగా అనారోగ్యానికి గురై ప్రజలు ఆసుపత్రులకు చేరుతున్నారు. ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య 15-20 శాతం పెరిగిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. చలి కారణంగా శ్వాస సమస్యలు, న్యూమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై చలి ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు.
రహదారిని పొగమంచు కప్పేసిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దిల్లీకి వెళుతున్న ఓ వాహనం అదుపు తప్పి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
జమ్ములో...
హిమాలయ ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2.4 డిగ్రీల సెల్సియస్‌తో దశాబ్దంలోనే అత్యంత శీతలమైనదిగా సోమవారం రాత్రి రికార్డులకెక్కింది. పొగమంచు కారణంగా జమ్ము విమానాశ్రయంలో ఉదయం పూట విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. శ్రీనగర్‌లో -6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రాస్‌లో -28.8, లద్దాఖ్‌లో -20.1, పాల్గాంలో 10.2, కశ్మీర్‌లోయలో -9.3, కోకెర్నాగ్లో -7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హిమాచల్...
శీతలగాలులు వీస్తున్న కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో జనజీవనం స్తంభించిపోయింది. చలికాలంలో సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు క్షీణించాయి. కైలాంగ్ ప్రాంతంలో -11.8 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. కిన్నౌర్ జిల్లాలోని కల్పాలో -2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో -2.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాజస్థాన్...
గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌లోనూ చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు చలి ప్రభావంతో వణికిపోతున్నాయి. శిఖర్ జిల్లాలో -0.5 డిగ్రీల సెల్సియస్ నమోదయింది.
ఇదీ చూడండి: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి