కర్ణాటకలో అధికార పక్షంలో అసంతృప్తిపై వస్తోన్న వార్తలపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించారన్న వార్తలను ఖండించారు.
"నేను కొంతమంది ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ అయినట్లు కొన్ని ఛానళ్లు వార్తలను ప్రసారం చేశాయి. ఇది వాస్తవ దూరం. ఎలాంటి భేటీ నిర్వహించలేదని స్పష్టం చేస్తున్నా."
- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
అధికార భాజపాలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బెలగావిలో మాజీ ఎంపీ రమేశ్ కత్తి నివాసంలో ఉత్తర కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చివేత తర్వాత కొంతమందికి మంత్రి పదవులు దక్కలేదు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం కూడా కొంత మంది ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
భేటీ కాదు.. విందు..
ఎమ్మెల్యేల భేటీపై రమేశ్ కూడా వివరణ ఇచ్చారు. చాలా రోజులు అవుతోందని విందు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజ్యసభ సీటుకు సంబంధించి తన సోదరుడు ఉమేశ్ కత్తికి ఇప్పటికే యడియూరప్ప వాగ్దానం చేసినట్లు తెలిపారు.
"కొన్ని రోజుల కింద ముఖ్యమంత్రిని నా సోదరుడు కలిశారు. ఆయనతో రాజ్యసభ సీటు గురించి గుర్తు చేశారు ఉమేశ్. యడియూరప్ప కూడా నా సోదరుడి అభ్యర్థనను అంగీకరించి హామీ ఇచ్చారు."