నేలమ్మకు కొబ్బరినార చీరకడుతున్న ప్రభుత్వం! నేలమ్మను కాపాడుకునేందుకు కొబ్బరి పీచు, నారలతో నేసిన పర్యావరణహిత వస్త్రాన్ని సిద్ధం చేసింది కేరళ ప్రభుత్వం. ఈ భూవస్త్రాన్ని రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆనకట్టలుగా పరిచి వర్షాకాలంలో నేలకోత నివారణ కు పూనుకుంది.
ప్రవాహాలకు ఆనకట్టలు కూలిపోకుండా.. మట్టి కొట్టుకుపోకుండా.. ఈ భూవస్త్రాన్ని చెరువులు, కాలువల వంటి నీటి వనరుల ఒడ్డున పరచనున్నారు. ఇలా చేయడం వల్ల ఎండాకాలంలో నీటికొరత ఏర్పడకుండా నీటిని నిల్వ కూడా చేసుకోవచ్చు.
వరదను తట్టుకునే కవచం...
మన దేశంలో నైరుతి రుతుపవనాల ఆగమనం కేరళలోనే మొదలవుతుంది. దీంతో.. ఆ వైపుగా ఏ తుపాను వచ్చినా.. కేరళ తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఏటా కురిసే భారీ వర్షాలు, వరదలతో కోస్తా ప్రాంతాల్లోని వేల ఎకరాల నేల కోతకు గురవుతోంది. దీంతో ముంపు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పైగా.. కొట్టుకుపోయిన ఆనకట్టలు, ఇళ్లను పునర్నిర్మించాలంటే.. ప్రభుత్వానికీ భారీగా ఖర్చు అవుతుంది. అందుకే నేలకోతను అరికట్టేందుకే ఈ కొబ్బిరి పీచు వస్త్రాన్ని తయారు చేయిస్తోంది ప్రభుత్వం.
ఇలా పరిస్తే సరి!
ఈ భూ వస్త్రాలను వెదురు కర్రల సాయంతో నేలపై పరుస్తారు. ఆర అంగుళం మందంతో పరిచే ఈ వస్త్రం దాదాపు 50 శాతం వరకు నేలకోతను అడ్డుకుంటుంది. అదే ఓ అంగుళం మందంతో వస్త్రాన్ని పరిస్తే.. వందశాతం నేలకోతను అరికట్టవచ్చు. ఏళ్లపాటు మన్నికగా ఉండే ఈ భూవస్త్రం.. నేలను ధృడంగా చేస్తుంది..సేంద్రీయంగా సంరక్షిస్తుంది. అందుకే కొన్ని దేశాల్లో ఈ భూవస్త్రాలను రహదారుల నిర్మాణాల్లో ఉపయోగిస్తారు.
అంతే కాదు, సుమారు ఐదు నుంచి ఆరేళ్లలోగా ఇవి సహజంగా భూమిలో కలిసిపోతాయి. ఈ వస్త్రాలతో భూమి సారవంతమవుతుంది. తద్వారా గట్ల వెంట వృక్షసంపద దట్టంగా పెరుగుతుంది.
లక్షమందికి ఉపాధి...
ప్రభుత్వ అనుబంధ సంస్థ కాయిర్ జియోటెక్టైల్ పరిశ్రమలు ఇప్పటికే ఇలాంటి పర్యావరణహిత వస్త్రాలను రాష్ట్రంలోని 7 జిల్లాలలకు పంపిణీ చేశాయి. ఈ వస్త్రంతో పాటు ఫోమ్ మ్యాటింగ్స్, కాయిర్ ఫెడ్ వస్త్రాలు మూడు నుంచి నాలుగు జిల్లాలకు పంపాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం వల్ల.. కేరళలో 2 లక్షల సంప్రదాయ చేనేత కార్మిక కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది.
ఇదీ చదవండి:జనపనారకు రాగి పూస్తే.. నీటి కాలుష్యానికి చెక్!