తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: బలపరీక్ష సవాలులో గెలుపెవరిది? - KUMARASWAMY

శాసనసభ్యుల రాజీనామాతో రాజకీయ సంక్షోభం నెలకొన్న కర్ణాటకలో నాటకీయ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయినందున సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. రెండు రోజుల విరామం తర్వాత నేడు పునఃప్రారంభం కానున్న విధానసభలో బలపరీక్ష కోసం భాజపా పట్టుపట్టే అవకాశం ఉంది.

కర్ణాటకీయం: బలపరీక్ష సవాలులో గెలుపెవరిది?

By

Published : Jul 15, 2019, 5:45 AM IST

రోజుకో పరిణామంతో కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కన్నడనాట ఈనెల 6న కాంగ్రెస్- జేడీఎస్​కు చెందిన పలువురు శాసనసభ్యుల రాజీనామాతో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమైంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు కాంగ్రెస్​, జేడీఎస్​ నేతలు రాజీనామాలు ఉపసంహరించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఈ తరుణంలో విధానసభలో బలపరీక్షకు దిగితే చివరకు కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికే ఎసరు వచ్చేలా కనిపిస్తోంది. గత శుక్రవారమే మొదలైన శాసనసభ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విధానసభలో అధికార, ప్రతిపక్షాలు బలపరీక్షకు దిగితే ఎవరు నెగ్గుతారన్న సందేహాలు అందరి మదిలో మెదులుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం నిలుస్తుందా? లేదా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందా అని కన్నడ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యమంత్రి.. బలపరీక్షకు సిద్ధమా?

బలపరీక్షకు తాను సిద్ధంగా ఉన్నట్లు కుమారస్వామి గత శుక్రవారమే స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా నిర్వహించాలని స్పీకర్​కు విన్నవించారు కూడా. తాజాగా ప్రతిపక్ష నేత యడ్యూరప్ప కూడా ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. కుమారస్వామి బలపరీక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. సభలో మెజారిటీ లేనందున.. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవముంటే సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

వ్యూహాలపై చర్చ

సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పటికీ తమ అధికారానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని కుమారస్వామి ధీమాగా ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్​ నేతలు మరోసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్​ నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, మంత్రి డీకే శివకుమార్​లు ఈ భేటీకి హాజరయ్యారు. జేడీఎస్​ తరఫున సీఎం కుమారస్వామి హాజరయ్యారు. విశ్వాస పరీక్ష నిర్వహిస్తే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్యేలంతా వెనక్కి వస్తారని కాంగ్రెస్ నేత డీ.కే.శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.

ఫలించని బుజ్జగింపులు

రాజీనామా చేసిన కాంగ్రెస్​-జేడీఎస్​ నేతలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యరులతోనూ కూటమి వర్గాలు మంతనాలు జరిపాయి. రాజీనామా చేసిన కాంగ్రెస్​ నేత ఎంటీబీ నాగరాజు.. బుజ్జగింపులతో శనివారం మెత్తపడ్డట్లు కనిపించారు. అయితే నాగరాజు గంటల వ్యవధిలోనే మాటమార్చారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజీనామా వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

మేం ఎవరితోనూ భేటీ అవ్వం

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్నందున.. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని పలువురు కాంగ్రెస్​ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ బుజ్జగింపులు ఫలించలేదు. రాజీనామా నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలువురు నేతలు ప్రకటించారు. అలాగే మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్​తో పాటు ఏ కాంగ్రెస్​ నేతతోనూ భేటీ అవ్వాలనే ఆలోచన లేదని ముంబయిలో ఉంటున్న 14 మంది రెబల్​ నేతలు పోలీసులకు లేఖ రాశారు.

ABOUT THE AUTHOR

...view details