రాష్ట్రంలో అసెంబ్లీని సమావేశపరిచి తన బలాన్ని ప్రదర్శించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన నోట్‌లో సరైన తేదీ, కారణాలు లేవంటూ గవర్నర్ ఇప్పటికే అభ్యంతరం తెలిపారు.
తాజాగా బలనిరూపణ వంటి కారణాలు పక్కకు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత, ఇతర బిల్లులపై చర్చించేందుకే సమావేశాలు ఏర్పాటుచేయాలనే కారణాలతో గహ్లోత్... గవర్నర్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎలాగైనా అసెంబ్లీని సమావేశపరచాలనే వ్యూహాన్ని ముఖ్యమంత్రి గహ్లోత్ రచిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని రాజస్థాన్ కాంగ్రెస్ మరోసారి విమర్శించింది. అసెంబ్లీ సమావేశాలకు పిలవాలన్న ముఖ్యమంత్రి అభ్యర్థనను గవర్నర్ పట్టించుకోవడం లేదని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అవినాష్ పాండే ఆరోపించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు అవసరమైతే ప్రధాని నివాసం వెలుపల అయినా ధర్నా చేద్దామని తన ఎమ్మెల్యేలకు సూచించారు. పరిస్థితులు కుదుటపడేవరకు హోటల్‌లోనే ఉండాలని ముఖ్యమంత్రి గహ్లోత్ ఎమ్మెల్యేలకు సూచించారు.
ఇదీ చూడండి: 'స్పీకర్ అధికారాల్ని ప్రశ్నించటం ఆందోళనకరం'