మధ్యప్రదేశ్‌లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజల నమ్మకాలను భాజపా దెబ్బకొట్టిందని భోపాల్‌లో మీడియా సమావేశంలో ఆరోపించారు కమల్‌నాథ్.
"15 నెలల పాటు రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడి పనిచేశాం. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. 2018 డిసెంబరులో మా ప్రభుత్వం ఏర్పడింది. మెజార్టీ స్థానాలు గెలుచుకుని మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రైతులు మాపై ఎంతో విశ్వాసం ఉంచారు. వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాం, 20లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ప్రజల విశ్వాసానికి అనుకూలంగా పరిపాలించాలని భావించాం. కానీ, మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రజల నమ్మకాన్ని భాజపా వమ్ము చేసింది. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కుట్రలు పన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పనిచేయడం భాజపాకు నచ్చలేదు."
- కమల్‌నాథ్
తీవ్ర ఉత్కంఠ...
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తగిన సంఖ్యాబలం లేకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్టు కమల్‌నాథ్ ప్రకటించారు. అనంతరం గవర్నర్ లాల్జీ టాండన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు కమల్‌నాథ్. గత రెండు వారాలుగా మధ్యప్రదేశ్‌లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య విలువల్ని బలహీనపరిచాయని లేఖలో ఆయన పేర్కొన్నారు. కమల్‌నాథ్ రాజీనామాతో రాష్ట్రంలో భాజపా సర్కార్ కొలువుతీరేందుకు మార్గం సుగమం అయింది.